అంపైర్ తీరుకు నిరసనగా క్రీజులో ఉన్న ఆటగాళ్లను వెనక్కి పిలవడంపై పంత్ వివరణ

  • గతరాత్రి ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్
  • చివర్లో మూడు వరుస సిక్సులు బాదిన పావెల్
  • నాలుగో బంతి ఫుల్ టాస్
  • అంపైర్ నోబాల్ ఇవ్వలేదంటూ ఢిల్లీ శిబిరం ఆగ్రహం
  • మైదానంలోకి వెళ్లిన ఢిల్లీ సహాయక కోచ్
గత రాత్రి రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ చివర్లో అనూహ్య వివాదం చెలరేగింది. ఢిల్లీ ఆటగాడు రోవ్ మాన్ పావెల్ వరుసగా మూడు సిక్సులు బాది ఢిల్లీని గెలుపు బాటలో నిలిపాడు. అయితే నాలుగో బంతి ఫుల్ టాస్ రాగా, దాన్ని అంపైర్ నోబాల్ గా ప్రకటించకపోవడం వివాదం రూపుదాల్చింది. 

ఆ బంతి ఎత్తును అంపైర్ పరిగణనలోకి తీసుకుని నోబాల్ ఇవ్వాలని ఢిల్లీ శిబిరం భావించింది. అంపైర్ తీరుకు నిరసనగా, క్రీజులో ఉన్న తమ ఆటగాళ్లను పంత్ వెనక్కి పిలిపించాడు. ఢిల్లీ జట్టు అసిస్టెంట్ కోచ్ ఆమ్రే మైదానంలోకి రాగా, అంపైర్ అతడికి నచ్చచెప్పి పంపించాడు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు 15 పరుగుల తేడాతో ఓడింది. మ్యాచ్ చివర్లో జరిగిన ఘటనపై పంత్ వివరణ ఇచ్చాడు. 

ఆ బంతి నోబాల్ అని తామందరం నమ్ముతున్నామని, కానీ అంపైర్ నోబాల్ ప్రకటించకపోవడంతో అందరం అసంతృప్తికి గురయ్యామని తెలిపాడు. ఈ విషయంలో థర్డ్ అంపైర్ కలుగచేసుకుని ఉంటే బాగుండేదని పంత్ అభిప్రాయపడ్డాడు. థర్డ్ అంపైర్ రీప్లే పరిశీలించి దాన్ని నోబాల్ గా ప్రకటించాల్సిందని పేర్కొన్నాడు. ఇక, ఆటగాళ్లను వెనక్కి పిలిపించడం, అసిస్టెంట్ కోచ్ ఆమ్రేను మైదానంలోకి పంపడం ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలని, అందుకు తాను విచారిస్తున్నట్టు పంత్ తెలిపాడు. పనిలోపనిగా, ఈ టోర్నీలో అంపైరింగ్ చాలా బాగుందంటూ సెటైర్ వేశాడు.


More Telugu News