ఛేజింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఏం తగ్గలేదు కానీ...!

  • గతరాత్రి ఉత్కంఠభరితంగా మ్యాచ్
  • 200 పైచిలుకు పరుగులు చేసిన ఇరుజట్లు
  • 20 ఓవర్లలో 2 వికెట్లకు 222 రన్స్ చేసిన రాజస్థాన్
  • లక్ష్యఛేదనలో 8 వికెట్లకు 207 రన్స్ చేసిన ఢిల్లీ
  • ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రోవ్ మాన్ పావెల్
ఐపీఎల్ తాజా సీజన్ లో గత రాత్రి భారీ స్కోర్ల మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ లో రెండు జట్లు కూడా 200 పైచిలుకు పరుగులు చేయడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు జోస్ బట్లర్ (65 బంతుల్లో 116) సూపర్ సెంచరీ సాయంతో 20 ఓవర్లలో 2 వికెట్లకు 222 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. 

ఆపై, లక్ష్యఛేదనలో ఢిల్లీ జట్టు చివరికంటా పోరాడింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 207 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఆఖర్లో రోవ్ మాన్ పావెల్ 15 బంతుల్లోనే 36 పరుగులు చేసి ఢిల్లీ జట్టును గెలిపించేందుకు తీవ్రంగా పోరాడాడు. అతడి స్కోరులో 5 భారీ సిక్సులున్నాయి. అయితే, ఒబెద్ మెక్ కాయ్ అతడ్ని అవుట్ చేయడంతో ఢిల్లీ ఆశలకు తెరపడింది. 15 పరుగుల తేడాతో రాజస్థాన్ జయభేరి మోగించింది. 

అంతకుముందు, కెప్టెన్ రిషబ్ పంత్ 44, లలిత్ యాదవ్ 37, ఓపెనర్లు పృథ్వీ షా 37, డేవిడ్ వార్నర్ 28 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, రవిచంద్రన్ అశ్విన్ 2, ఒబెద్ మెక్ కాయ్ 1, యజువేంద్ర చహల్ 1 వికెట్ తీశారు.


More Telugu News