సెంచరీతో శివాలెత్తిన జోస్ బట్లర్... 222 పరుగులు సాధించిన రాజస్థాన్

  • 65 బంతుల్లో 116 పరుగులు చేసిన బట్లర్
  • 9 ఫోర్లు, 9 సిక్సర్లతో విశ్వరూపం
  • తాజా టోర్నీలో మూడో సెంచరీ సాధించిన బట్లర్
  • శాంసన్ మెరుపు ఇన్నింగ్స్
  • అర్ధసెంచరీ సాధించిన పడిక్కల్
ఇంగ్లండ్ ఆటగాడు జోస్ బట్లర్ తాజా ఐపీఎల్ సీజన్ లో భీకర ఫామ్ తో చెలరేగిపోతున్నాడు. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో బట్లర్ సెంచరీతో ఉగ్రరూపం ప్రదర్శించాడు. బట్లర్ సెంచరీ సాయంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 222 పరుగులు చేసింది. 

65 బంతులు ఎదుర్కొన్న బట్లర్ 9 ఫోర్లు, 9 భారీ సిక్సర్లతో 116 పరుగులు చేసి ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. తాజా టోర్నీలో ఇప్పటికే రెండు సెంచరీలు సాధించిన బట్లర్, నేడు ముచ్చటగా మూడో శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. బట్లర్ బాదుడు ముందు మైదానం చిన్నబోయింది. బంతిని బలంగా బాదడం ఎలాగో చూపించిన బట్లర్ చివరికి ముస్తాఫిజూర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. అయితే, ఢిల్లీ జట్టుకు ఊపిరి పీల్చుకోవడానికేమీ లేదు... అప్పటికే స్కోరు 200 దాటింది. 

మరో ఎండ్ లో ధాటిగా ఆడుతున్న కెప్టెన్ సంజు శాంసన్ తన ట్రేడ్ మార్క్ షాట్లతో విరుచుకుపడడంతో రాజస్థాన్ రాయల్స్ ఈ టోర్నీలో అత్యధిక స్కోరు నమోదు చేసింది. శాంసన్ 19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. అంతకుముందు, బట్లర్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన ఎడంచేతివాటం దేవదత్ పడిక్కల్ అర్ధసెంచరీతో అలరించాడు. పడిక్కల్ 35 బంతులాడి 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 1, ముస్తాఫిజూర్ రెహ్మాన్ 1 వికెట్ తీశారు.


More Telugu News