ఏ బావ కళ్లలో ఆనందం కోసం ఆనందం కోసం ఇదంతా చేశారు?: ఏబీ వెంకటేశ్వరరావు

  • ఏబీవీ పై సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు
  • రాష్ట్ర ఉన్నతాధికారులపై మండిపడ్డ ఏబీవీ
  • అధికారులకు నిబంధనలు తెలియవా? అని మండిపాటు

ఏపీ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆయనను మళ్లీ సర్వీసుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ఉన్నతాధికారులపై విమర్శలు గుప్పించారు.

ఏ బావ కళ్లలో ఆనందం కోసం ఇదంతా చేశారని ప్రశ్నించారు. ఏ శాడిస్ట్ కోసం, ఏ సైకో కోసం ఇదంతా చేశారని నిప్పులు చెరిగారు. తనను, తన కుటుంబాన్ని క్షోభ పెట్టి సాధించిందేమిటని అడిగారు. ప్రభుత్వానికి, అధికారులకు నిబంధనలు తెలియవా? అని ఆయన ప్రశ్నించారు. కొందరు అధికారులు తప్పుడు కేసులతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా చేశారని అన్నారు. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు ఓడిపోవడానికి ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు.

సస్పెన్షన్ ను ప్రశ్నించడమే తాను చేసిన తప్పా? అని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. లాయర్ల కోసం ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేసిందని... ఇప్పుడు సుప్రీంకోర్టులో వాదించేందుకు ఒక లాయర్ల టీమ్ నే ఏర్పాటు చేసిందని తెలిపారు. వీరికి ఎన్ని కోట్లు చెల్లించారో తనకు తెలియదని చెప్పారు. 

ఈ కేసుల వల్ల తనకు కూడా అంతే ఖర్చు అయిందని అన్నారు. తన ఫీజును కూడా చెల్లించాలంటూ ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పారు. ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసిన అధికారుల నుంచి రెవెన్యూ రికవరీ చేయాలని అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకునేంత వరకు వదిలిపెట్టనని చెప్పారు. 

రెండేళ్లు ముగిసిన తర్వాత సస్పెన్షన్ చెల్లదని చీఫ్ సెక్రటరీకి లేఖ రాశానని... అయినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదని అన్నారు. తాను ఎప్పుడూ చట్టం ప్రకారమే ముందుకెళ్లానని చెప్పారు. తాను లోకల్ అని... ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని హెచ్చరించారు. తాను డ్యూటీలో చేరతానని చెప్పారు.


More Telugu News