ఉక్రెయిన్ లో హింసను ఆపాల్సిందే.. బోరిస్ తో సమావేశం అనంతరం ప్రధాని మోదీ

  • చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారమన్న మోదీ 
  • దేశ సార్వభౌమత్వం, సమగ్రతను గౌరవించాలని వ్యాఖ్య 
  • బోరిస్ జాన్సన్ తో అనేక విషయాలను చర్చించామన్న ప్రధాని
  • ఇండో పసిఫిక్ రీజియన్ లోకి స్వాగతమన్న మోదీ
ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్ లో హింసను ఆపాల్సిందేనని స్పష్టం చేశారు. కాల్పులను వెంటనే ఆపాలని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని తేల్చి చెప్పారు. 

ఓ దేశ సార్వభౌమత్వం, సమగ్రతను పక్క దేశాలు గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్థాన్ విషయంలో సుస్థిరత, శాంతి, సురక్షితమైన ఆఫ్ఘనిస్థాన్ నే తాను కోరుకున్నానని, సమ్మిళత ప్రభుత్వం రావాలన్న కాంక్ష ఉందని చెప్పారు. ఇతర దేశాల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు ఆఫ్ఘన్ గడ్డ అడ్డా కాకూడదన్నారు. 

బోరిస్ తో రక్షణ, పర్యావరణం, విద్యుచ్ఛక్తి రంగాలపై చర్చ జరిగిందన్నారు. ఇండో పసిఫిక్ రీజియన్ లో బ్రిటన్ చేరడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత సమ్మిళిత అధికారాన్నే మెయింటెయిన్ చేయాలన్నారు. ఇరు దేశాల మధ్య అంతర్జాతీయ ఆవిష్కరణల భాగస్వామ్యంపై ఒప్పందం కుదిరిందన్నారు. ఇతర దేశాలతో తమ బంధం మరింత దృఢమయ్యేందుకు ఈ ఒప్పందం మరింత దోహదం చేస్తుందన్నారు. 

ఈ ఒప్పందంలో భాగంగా మేడిన్ ఇండియా ఆవిష్కరణలను విదేశాలకు అందిస్తామన్నారు. అందుకోసం 10 కోట్ల డాలర్లను బ్రిటన్ ప్రభుత్వం సమకూర్చనుందన్నారు. గత ఏడాది వ్యూహాత్మక సమగ్ర భాగస్వామ్యం కోసం భారత్, బ్రిటన్ మధ్య ఒప్పందం కుదిరిందని ప్రధాని గుర్తు చేశారు. 

పర్యావరణం, విద్యుచ్ఛక్తి రంగాలపై కలిసి పనిచేసేందుకు నిర్ణయించామన్నారు. భారత జాతీయ హైడ్రోజన్ మిషన్ లో చేరాల్సిందిగా బ్రిటన్ కు ఆహ్వానం పలికామన్నారు. స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందంపై రెండు దేశాలు కసరత్తు చేస్తున్నాయన్నారు. చర్చల్లో మంచి పురోగతి వచ్చిందన్నారు. ఈ ఏడాది చివరి నాటికి డీల్ ను ఖరారు చేస్తామన్నారు. 

2030 నాటికి భారత్–బ్రిటన్ మధ్య మరింత దృఢమైన బంధం కోసం ఈ దశాబ్దంలోనే రోడ్ మ్యాప్ ను గైడ్ ను రూపొందించామన్నారు. దాని పురోగతిపైనా చర్చించామని, భవిష్యత్ కోసం కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నామని స్పష్టం చేశారు.


More Telugu News