ఏపీలో సామూహిక అత్యాచారం ఘటన.. సీఐ, ఎస్సైపై వేటు!
- విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారం
- బాధితురాలి తల్లిదండ్రులు ఆధారం ఇచ్చినా పట్టించుకోని పోలీసులు
- పీఎస్ వద్ద వివిధ పార్టీలు, ప్రజాసంఘాల ఆందోళన
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన అందరినీ కలచి వేస్తోంది. ఈ ఘటన పట్ల స్థానిక పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలపాలవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. నున్న సీఐ, సెక్టార్ ఎస్సైలపై సస్పెన్షన్ వేటు వేసింది.
వివరాల్లోకి వెళ్తే, తమ కుమార్తె కనిపించడం లేదంటూ బాధితురాలి తల్లిదండ్రులు నున్న పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. వారి ఆవేదనను ఏమాత్రం పట్టించుకోని పోలీసులు... సాయంత్రం రావాలంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫలానా నంబర్ నుంచి చివరి సారిగా ఫోన్ వచ్చిందంటూ ఆధారాన్ని ఇచ్చినా వారు స్పందించలేదు. ఈ విషయం బయటకు రావడంతో పోలీసుల తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు నున్న పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో సీఐ హనీశ్, సెక్టర్ ఎస్సై శ్రీనివాసరావును విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతా రాణా టాటా సస్పెండ్ చేశారు.