ముంబై ఆశలను వమ్ము చేసిన ధోనీ.. ఏడో మ్యాచ్‌లోనూ ఓటమి

  • చివరి బంతికి ఫోర్ కొట్టి జట్టును గెలిపించిన ధోనీ
  • ప్లే ఆఫ్స్ ఆశలను దూరం చేసుకున్న ముంబై
  • ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా ముకేశ్ చౌదరి
అయిపోయింది.. ముంబై పని అయిపోయింది. వరుసగా ఏడో మ్యాచ్‌లోనూ ఓడి ప్లే ఆఫ్స్ ఆశలను దూరం చేసుకుంది. చెన్నైతో గత రాత్రి జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లోనూ పరాజయం పాలైన ముంబై ఇప్పటి వరకు ఖాతా తెరవకపోవడం ఆ జట్టు అభిమానులను కలవరపెడుతోంది. విజయం అంచుల వరకు వచ్చి ఓడిపోవడం ముంబైకి అలవాటుగా మారింది. చెన్నైతో జరిగిన తాజా మ్యాచ్‌లోనూ అదే జరిగింది. 

చివరి ఓవర్‌లో చెన్నై విజయానికి 17 పరుగులు అవసరం. తొలి బంతికే జోరుమీదున్న ప్రిటోరియస్ (22) వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో ముంబై శిబిరంలో కేరింతలు మొదలయ్యాయి. రెండో బంతికి బ్రావో సింగిల్ తీశాడు. ఇక, చివరి నాలుగు బంతుల్లో 16 పరుగులు అవసరం. క్రీజులో ఉన్న ధోనీ మరోమారు తానెంత విలువైన ఆటగాడినో నిరూపిస్తూ మూడో బంతిని సిక్స్ బాదాడు. అదే ఊపులో నాలుగో బంతిని బౌండరీకి తరలించాడు. చివరి రెండు బంతుల్లో 6 పరుగులు అవసరం. ఐదో బంతికి రెండు పరుగులు తీసిన ధోనీ.. ఆరో బంతికి ఫోర్ కొట్టి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఫలితంగా చెన్నై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్‌లో చివరి బంతికి చెన్నై విజయం సాధించడం చెన్నైకి ఇది 8వ సారి.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. చెన్నై బౌలర్ల దెబ్బకు వికెట్లను టపటపా రాల్చుకున్న రోహిత్ సేన బ్యాటింగ్‌లో మరోమారు తేలిపోయింది. తిలక్ వర్మ అర్ధ సెంచరీ (43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 51) ఆదుకోవడంతో ముంబై ఆ మాత్రం పరుగులైనా చేయగలిగింది. సూర్యకుమార్ యాదవ్ 32, కొత్త కుర్రాడు హృతిక్ షాకీన్ 25, ఉనద్కత్ 19 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి 3, బ్రావో రెండు వికెట్లు పడగొట్టారు. 

అనంతరం 156 పరుగుల ఓ మాదిరి విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు చెన్నై ఆపసోపాలు పడింది. చివరి బంతి వరకు మ్యాచ్‌ను లాక్కెళ్లి పీకల మీదకు తెచ్చుకుంది. ధోనీ మరోమారు జట్టుకు ఆపద్బాంధవుడయ్యాడు. చివరి బంతికి ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. రాబిన్ ఊతప్ప 30, అంబటి రాయుడు 40, ధోనీ 28 (నాటౌట్), ప్రిటోరియస్ 22 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో డేనియల్ శామ్స్ నాలుగు, ఉనద్కత్ 2 వికెట్లు తీసుకున్నారు. చెన్నై బౌలర్ ముకేశ్ చౌదరికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 

ఆడిన ఏడు మ్యాచుల్లోనూ ఓడిన ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండగా, ఏడు మ్యాచుల్లో రెండింటిలో విజయం సాధించిన చెన్నై దానిపైన ఉంది. ఇక, ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు సమాధి అయినట్టే. ఇకపై ఆడిన అన్ని మ్యాచ్‌లు గెలిచినా ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం దాదాపు కష్టమే. చెన్నైది కూడా దాదాపు అదే పరిస్థితి. అయితే, ముంబైతో పోలిస్తే కొంత మెరుగు.


More Telugu News