కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో స‌బ్ క‌లెక్ట‌ర్‌, ఏపీఎండీసీ సీపీఓకు జైలు శిక్ష‌

  • మైనింగ్‌తో ఇల్లు కోల్పోయిన మంగంపేట వాసి న‌ర‌స‌మ్మ‌
  • ప‌రిహారం కోసం హైకోర్టును ఆశ్ర‌యించిన బాధితురాలు
  • ప‌రిహారం ఇవ్వాల‌న్న కోర్టు ఆదేశాల‌ను అమ‌లు చేయ‌ని అధికారులు
  • బాధితురాలి తాజా పిటిష‌న్‌తో అధికారులకు శిక్ష ఖరారు
ఏపీలో కోర్టు ధిక్క‌ర‌ణ‌కు పాల్ప‌డ్డ మ‌రో ఇద్ద‌రు ఉన్న‌తాధికారుల‌కు ఆ రాష్ట్ర హైకోర్టు జ‌రిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించింది. ఈ మేర‌కు గురువారం నాడు ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో రాజంపేట స‌బ్ క‌లెక్ట‌ర్ ఖేత‌న్ గ‌ర్గ్‌, ఏపీఎండీసీ సీపీఓ సుద‌ర్శ‌న్ రెడ్డిల‌కు 6 నెల‌ల జైలు శిక్ష‌తో పాటు రూ.2 వేల చొప్పున జ‌రిమానా విధించింది.

ఈ కేసు వివ‌రాల్లోకెళితే... ఓబుల‌వారిప‌ల్లె మండ‌లం మంగంపేటలో 2003లో జ‌రిగిన మైనింగ్ కార‌ణంగా గ్రామానికి చెందిన న‌ర‌స‌మ్మ త‌న ఇంటిని కోల్పోయారు. ప‌రిహారం కోసం ప్ర‌భుత్వాన్ని ఆశ్ర‌యించ‌గా... ఆమెకు ఫ‌లితం ద‌క్క‌లేదు. 

దీంతో ఆమె హైకోర్టును ఆశ్ర‌యించ‌గా...ఆమెకు ప‌రిహారం చెల్లించాల‌ని ఇదివ‌ర‌కే హైకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలు జారీ చేసినా ఆమెకు ప‌రిహారం అంద‌లేదు. దీంతో మ‌రోమారు న‌ర‌స‌మ్మ హైకోర్టును ఆశ్ర‌యించ‌గా... కోర్టు ఇద్ద‌రు అధికారుల‌కు జైలు శిక్ష‌తో పాటు జ‌రిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.


More Telugu News