11వ వేతన సవరణపై ఉద్యోగులు సంతోషంగా లేరు.. ప్రభుత్వంలో చిత్తశుద్ధి కరవైంది: ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ

  • విధిలేకే పీఆర్సీకి అంగీకరించాల్సి వచ్చిందన్న సూర్యనారాయణ 
  • ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏకతాటిపైకి వస్తే తప్ప ప్రభుత్వం లొంగదని వ్యాఖ్య 
  • సీపీఎస్ రద్దుపై జగన్ ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదని విమర్శ  
  • మే 5న భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామన్న ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు  
ప్రభుత్వం ప్రకటించిన 11వ వేతన సవరణపై ప్రభుత్వ ఉద్యోగులు సంతృప్తిగా లేరని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అన్నారు. విధిలేకే పీఆర్సీని అంగీకరించాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏకతాటిపైకి వస్తే తప్ప ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం సాధ్యం కాదని అన్నారు. 

ప్రభుత్వ చిత్తశుద్ధి లోపమో, లేదంటే అధికారుల అలసత్వమో తెలియదు కానీ, పీఆర్సీపై ఒప్పందం మేరకు అంగీకరించిన 22 డిమాండ్లపై ఇప్పటి వరకు ఉత్తర్వులే వెలువడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దుపై సీఎం జగన్ ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదన్నారు. 

విజయవాడలో నిన్న 12 ఉపాధ్యాయ సంఘాలు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జేఏసీలో చేరాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై సూర్యనారాయణకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం సూర్యనారాయణ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెల 5న సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.


More Telugu News