తెలంగాణ రిజిస్ట్రేష‌న్ ఆదాయంలో భారీ పెరుగుద‌ల‌

  • వ‌రుస‌గా పెరుగుతున్న‌ రిజిస్ట్రేష‌న్ శాఖ ఆదాయం
  • గ‌తేడాది ఏప్రిల్‌లో రూ.720 కోట్ల ఆదాయం
  • ఈ నెల‌లో ఇప్ప‌టికే రూ.770 కోట్ల ఆదాయం
  • నెలాఖ‌రుకు వెయ్యి కోట్లు దాటే అవ‌కాశం
ధ‌నిక రాష్ట్రంగా అవ‌త‌రించిన తెలంగాణ‌లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం క్ర‌మంగా పెరుగుతూనే వ‌స్తోంది. ఏటికేడు పెరుగుతున్న ఈ శాఖ ఆదాయంలో ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో పెరుగుద‌ల న‌మోద‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ  ఒక్క నెల‌లోనే ఏకంగా రూ.1,000 కోట్ల మేర ఆదాయం ఈ శాఖ నుంచి వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని ఆ శాఖ చెబుతోంది.

గ‌త కొంత కాలంగా ప్ర‌తి నెలా రిజిస్ట్రేష‌న్ శాఖ ఆదాయం పెరుగుతూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌తేడాది ఏప్రిల్‌లో ఈ శాఖ రూ.720 కోట్ల మేర ఆదాయాన్ని సాధించ‌గా... తాజాగా ఈ ఏడాది ఏప్రిల్ నెల‌లో 20వ తేదీ నాటికే రూ.770 కోట్ల మేర ఆదాయం వ‌సూలైంది. 20 రోజుల‌కే రూ.770 కోట్లు వ‌చ్చిందంటే... ఇంకా మిగిలిన 10 రోజుల‌కు ఎంత‌లేద‌న్నా మ‌రో రూ.300 కోట్ల మేర ఆదాయం రానుంది. వెర‌సి ఈ ఏడాది ఏప్రిల్ నెల‌లో రిజిస్ట్రేష‌న్ శాఖ ఆధాయం రూ.1,000 కోట్లు దాటిపోయే అవ‌కాశాలున్నాయి.


More Telugu News