వేసవిలో రోజుకో ఉల్లిపాయ తింటే ఎన్ని లాభాలో!

  • ఒంటికి చలువ చేసే ఉల్లి  
  • దురద రాకుండా కాపాడే గుణం
  • కేన్సర్లు రాకుండా పోరాడే శక్తి
  • రోగనిరోధక వ్యవస్థ దృఢం
  • పుష్కలంగా విటమిన్ సీ లభ్యత
బిర్యానీ తినాలంటే పక్కన ఉల్లి ముక్క ఉండాల్సిందే. రోడ్డు మీద పానీపూరి లాగించాలంటే ఆ పూరీలో రెండు ముక్కల ఉల్లిగడ్డ పడాల్సిందే. అంతెందుకు రోజూ.. ఉల్లి లేని కూర ఉంటుందా! అంతలా మన వంటకాల్లో అది భాగమైపోయింది. 

ఆహారపరంగానే కాదు.. ఆరోగ్య పరంగానూ ఉల్లి చాలా మేలు చేస్తుంది. అందుకేనేమో మన తాతల కాలం నాటి నుంచి ‘ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు’ అనే సామెత వస్తోంది. వేసవిలో రోజూ ఒక ఉల్లిపాయను తింటే ఆరోగ్యానికి చాలా లాభాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. 

మొక్కల్లో ఉండే పదార్థాలు, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉల్లిపాయలో పుష్కలంగా ఉంటాయంటున్నారు. కేన్సర్లు రాకుండా పోరాడుతుందని, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుందని, దగ్గు, జలుబు రాకుండా కాపాడుతుందని, తెమడ, చీమిడి ఎక్కువ రాకుండా చూస్తుందని చెబుతున్నారు. 

అంతేకాదు.. ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుందని, రోగనిరోధక శక్తిని పెంపొదిస్తుందని అంటున్నారు. ‘‘సాధారణంగా వేసవిలో వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి కీటకాలు కుట్టడం ద్వారా వచ్చే వ్యాధులు ఎక్కువగా రావొచ్చు. కాబట్టి వాటి నుంచి రక్షించుకోవాలంటే మన రోగనిరోధక శక్తి పటిష్ఠంగా ఉండాలి. రోజుకో ఉల్లిపాయ తింటే రోగనిరోధక వ్యవస్థ దృఢంగా తయారవుతుంది. వేసవి వేడిని తగ్గించి శరీరానికి చలువ చేస్తుంది’’ అని కన్సల్టింగ్ న్యూట్రీషనిస్ట్ ఆస్మా ఆలం అంటున్నారు. 

కేన్సర్ ముప్పును తగ్గిస్తుందన్నారు. జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుందని చెబుతున్నారు. పాతకాలంలోనూ తలనొప్పులు, గుండె వ్యాధులు, నోటి పొక్కులకు ఉల్లితోనే చికిత్స చేసేవారన్నారు. ఒక మధ్యస్థ పరిమాణం ఉన్న ఉల్లిపాయతో 44 కేలరీల శక్తి మాత్రమే వస్తుందని, ఇమ్యూనిటీని పెంచేందుకు, చర్మ కణజాల నిర్మాణానికి, కణ గాయాన్ని నయం చేయడానికి, ఐరన్ సంగ్రహణానికి అవసరమయ్యే విటమిన్ సీ అందులో పుష్కలంగా లభిస్తుందని చెప్పారు.    

ఉల్లిపాయలో ఉండే క్వెర్సిటిన్ అనే రసాయనం.. సహజ సిద్ధమైన యాంటీ హిస్టమైన్ గా పనిచేస్తుందని ఆస్మా చెప్పారు. దాని వల్ల ఒంటిపై దద్దుర్లు, దురదను నివారించవచ్చని పేర్కొన్నారు.


More Telugu News