జైశంకర్ నిజమైన దేశ భక్తుడు: రష్యా విదేశాంగ మంత్రి కితాబు

  • అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త అన్న రష్యా మంత్రి 
  • భారత్ తో మరింత సహకారానికి సిద్ధమని వ్యాఖ్య 
  • ప్రకటించిన సెర్గీ లవ్రోవ్
భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ను రష్యా ఆకాశానికెత్తేసింది. భారత్ కు జైశంకర్ నిజమైన దేశ భక్తుడని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లవ్రోవ్ అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి దిగుమతులను భారత్ తగ్గించుకోవాలంటూ అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిళ్లు వస్తున్న తరుణంలోనూ.. తన విదేశాంగ విధానాన్ని భారత్ నిర్ణయించుకుంటుందని, తన దేశ ఇంధన భద్రత కోసం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని జైశంకర్ లోగడ తేల్చి చెప్పారు. 

పరోక్షంగా రష్యా నుంచి తమకు అవసరమైనవి దిగుమతి చేసుకుంటామని స్పష్టం చేశారు. ‘’అభివృద్ధి, భద్రత కోణంలో మా దేశం కోసం నిర్ణయాలు తీసుకుంటాం’’ అని జైశంకర్ పేర్కొన్నారు. దీంతో రష్యా విదేశాంగ మంత్రి ఇలా కీర్తించడం గమనార్హం. 

భారత్ కు అతి తక్కువ ధరకే చమురు సరఫరా చేస్తామని రష్యా ఆఫర్ చేయడం తెలిసిందే. అనుభవజ్ఞుడైన దౌత్యవేత్తగా జైశంకర్ ను లవ్రోవ్ అభివర్ణించారు. రష్యా ఆహారం, భద్రత, రక్షణ కోసం సహచర పాశ్చాత్య దేశాలపై ఆధారపడదని స్పష్టం చేశారు. యూఎన్ చార్టర్ ను ఉల్లంఘిస్తూ చట్టవిరుద్ధమైన చర్యలవైపు నిలవని దేశాలతో సహకారానికి తాము సుముఖంగా ఉన్నామని, భారత్ కూడా అలాంటి దేశాల్లో ఒకటని లవ్రోవ్ చెప్పారు. 


More Telugu News