తెలంగాణ‌లో ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఎల‌క్ట్రిక్‌ వాహ‌నాల ఉత్ప‌త్తి ప్లాంట్

  • అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన బిలిటీ ఎల‌క్ట్రిక్‌
  • త‌న యూఎస్ ప‌ర్య‌ట‌న‌లో కంపెనీతో భేటీ అయిన కేటీఆర్‌
  • తెలంగాణ‌లో త్రిచక్ర వాహనాల ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు బిలిటీ సంసిద్ధ‌త‌
పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌లో దూసుకుపోతున్న తెలంగాణ‌కు మ‌రో కీల‌క ప‌రిశ్ర‌మ వ‌చ్చేందుకు రంగం సిద్ధ‌మైంది. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు సంబంధించి భారీ వాహ‌నాల త‌యారీ సంస్థ బిలిటీ ఎల‌క్ట్రిక్స్ త్రిచక్ర వాహ‌నాల త‌యారీ ప్లాంట్‌ను తెలంగాణ‌లో ఏర్పాటు చేసేందుకు సంసిద్ధ‌త వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ మంగ‌ళ‌వారం రాత్రి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా కార్య‌క‌లాపాలు సాగిస్తున్న బిలిటీ ఎల‌క్ట్రిక్ సంస్థ ఎలక్ట్రిక్ వాహ‌నాల విభాగంలో భారీ వాహ‌నాల‌ను త‌యారు చేస్తోంది. ఈ కంపెనీకి ఇప్ప‌టికే ప‌లు దేశాల్లో ఉత్ప‌త్తి ప్లాంట్లు ఉన్నాయి. అమెజాన్, ఐకియా, జొమాటో, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థ‌ల‌కు త‌మ వాహ‌నాల‌ను విక్ర‌యిస్తోంది. ఈ సంస్థ తాజాగా తెలంగాణ‌లో త‌న త్రిచక్ర వాహనాల ఉత్ప‌త్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధ‌త వ్య‌క్తం చేసింది. అంతేకాకుండా తెలంగాణ‌లో ఏర్పాటు చేయ‌నున్న బిలిటీ సంస్థ ప్లాంట్ ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ ప్లాంట్‌గా రికార్డుల‌కు ఎక్క‌నుంది.

ఇటీవ‌లి అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కేటీఆర్ ఈ సంస్థ ప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. కొత్త ప‌రిశ్ర‌మ‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అందిస్తున్న ప్రోత్సాహ‌కాలు, తెలంగాణ‌లో ఉన్న పారిశ్రామిక అనుకూలత‌ల‌ను ఆయ‌న కంపెనీ ప్ర‌తినిధుల‌కు వివ‌రించారు. కేటీఆర్ ప్ర‌జెంటేష‌న్‌పై లోతుగా ప‌రిశీలించిన బిలిటీ సంస్థ తెలంగాణ‌లో త‌న ఉత్ప‌త్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధ‌త వ్య‌క్తం చేసింది. దీనికి సంబంధించి త్వ‌ర‌లోనే ఒప్పందం కుదిరే అవ‌కాశాలు ఉన్నాయి.


More Telugu News