డాన్ బాస్ కోసం పోరాటం మొదలైంది: జెలెన్ స్కీ

  • డాన్ బాస్ లో భారీగా రష్యన్ సేనలు
  • రష్యన్ సైన్యం రెండో దశ యుద్ధం ప్రారంభించిందన్న జెలెన్ స్కీ
  • ఎంతమంది ఉన్నా పోరు ఆపబోమని స్పష్టీకరణ
ఉక్రెయిన్ ను ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని భావిస్తున్న రష్యా... ఆయుధాలు కిందపడేయాలంటూ ఉక్రెయిన్ సైనికులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తోంది. అయితే, ఉక్రెయిన్ అధినాయకత్వం మాత్రం రష్యా ప్రకటనలను ఏమాత్రం ఖాతరు చేయడంలేదు సరికదా, రష్యా ప్రాబల్యం ఉన్న తమ ప్రాంతాలకు విముక్తి కల్పిస్తామని చెబుతోంది. 

డాన్ బాస్ ప్రాంతం కోసం పోరాటం మొదలైందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ స్పష్టం చేశారు. రష్యా సేనలు డాన్ బాస్ కోసం రెండో దశ యుద్ధాన్ని ప్రారంభించినట్టు నిర్ధారణ అయిందని, రష్యన్ సైనికులు ఎంతమంది ఉన్నా డాన్ బాస్ కోసం ఉక్రెయిన్ పోరు మాత్రం ఆగదని ఉద్ఘాటించారు. 

అటు, డాన్ బాస్ లో రష్యా దళాలు భారీ ఎత్తున మోహరించడంపై ఈస్ట్ లుగాన్స్క్ ప్రాంత గవర్నర్ సెర్గీ గైడే కూడా స్పందించారు. గత కొన్నివారాలుగా చర్చనీయాంశంగా ఉన్న వ్యవహారం ఇప్పుడు కార్యరూపం దాల్చిందని తెలిపారు. రూబిజ్నే, పోపస్నా నగరాల్లో ఎడతెగని దాడులు జరుగుతున్నాయని, ఈ ప్రాంతంలోని ఇతర నగరాల్లోనూ యుద్ధ కల్లోలం నెలకొని ఉందని వివరించారు.


More Telugu News