ఇకపై పెరగనున్న బ్యాంక్ ఈఎంఐలు

  • రుణ రేట్లను 0.10 శాతం పెంచిన ఎస్బీఐ
  • ఇదే బాటలో ఇతర బ్యాంకులు 
  • త్వరలో ఆర్బీఐ కూడా రేట్లను పెంచొచ్చు
  • అదే జరిగితే రుణ గ్రహీతలకు భారమే
రుణాలు తీసుకున్న వారిపై వడ్డీ రేట్ల భారం పెరగబోతోంది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణ రేట్లను 0.10 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. కనుక ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐలు కొంచెం భారం కానున్నాయి. ఇతర బెంచ్ మార్క్ లకు అనుసంధానంగా ఉన్న రుణాలు తీసుకున్న వారికి తాజా రేట్ల పెంపు వర్తించదు. సవరించిన రేట్లు ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వచ్చినట్టు ఎస్బీఐ ప్రకటించింది.

తాజా సవరణతో ఏడాది కాల ఎంసీఎల్ఆర్ రేటు 7.10 శాతానికి చేరింది. దాదాపు అధిక శాతం రుణాలు ఏడాది కాల ఎంసీఎల్ఆర్ ఆధారిత రేటుకే లింక్ అయి ఉంటాయి. రెండేళ్ల ఎంసీఎల్ఆర్, ఒక నెల, మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లను కూడా ఎస్బీఐ ఇదే స్థాయిలో పెంచింది. కనుక పెరిగిన రేట్ల మేర ఈఎంఐను పెంచి కట్టాలి. లేదంటే ముందున్న ఈఎంఐనే చెల్లిస్తూ కాల వ్యవధిని పెంచుకోవచ్చు.

ఎస్బీఐ నిర్ణయాన్ని ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు అనుసరించనున్నాయి. ద్రవ్యోల్బణం 6 శాతాన్ని దాటిపోయిన తరుణంలో ధరల కట్టడికి ఆర్బీఐ కీలక రేట్లను జూన్ నాటి సమీక్షలో పెంచొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రెపో రేటును ఆర్బీఐ పెంచితే.. అప్పుడు కూడా రుణ రేట్లు మరింత పెరిగేందుకు దారితీస్తుంది. రెపో ఆధారిత రేట్లను కూడా బ్యాంకులు మంజూరు చేస్తున్నాయి. కనుక వేగంగా పెరిగిన రేట్ల భారాన్ని బ్యాంకులు వినియోగదారులకు బదలాయిస్తాయి. వడ్డీ రేట్ల పెరుగుదల క్రమంలో ఉన్నాం కనుక రుణ గ్రహీతలు అదనపు భారానికి సిద్ధపడక తప్పదు.


More Telugu News