నారాయణ్ దాస్ కె.నారంగ్ మృతి ప‌ట్ల చిరు, ప‌వ‌న్, మ‌హేశ్ సంతాపం

  • నారంగ్ మాట మీద నిలబడే నిఖార్సయిన మనిషన్న చిరంజీవి
  • నారంగ్ మృతి ప‌ట్ల చింతిస్తున్నానన్న ప‌వ‌న్ క‌ల్యాణ్
  • నారాయణ్‌ దాస్‌తో పనిచేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని మ‌హేశ్ ట్వీట్
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు నారాయణ్ దాస్ కె.నారంగ్ (78)  అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతి ప‌ట్ల సినీ న‌టులు చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మ‌హేశ్ బాబు సంతాపం తెలిపారు. 

'ప్రదర్శనారంగంలో నిష్ణాతుడు, మాట మీద నిలబడే నిఖార్సయిన మనిషి, నిబద్ధత కలిగిన వ్యక్తి, అపార అనుభవజ్ఞుడు, సినీ రంగంలో ఒక మహారథి, ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ నారాయణదాస్ నారంగ్ గారికి శ్రద్ధాంజలి' అని చిరంజీవి ట్వీట్ చేశారు. 

నారాయ‌ణ్ దాస్ నారంగ్ మృతి ప‌ట్ల చింతిస్తున్నానంటూ జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ ప్ర‌క‌ట‌న చేశారు. నారంగ్‌ ఆత్మకు శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. తాను న‌టించిన సినిమాల్లో కొన్నింటిని ఆయ‌న‌ సంస్థ ద్వారా పంపిణీ చేశారని చెప్పారు. నారంగ్ కుమారుడు సునీల్ నారంగ్‌, ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌కు త‌న‌ ప్రగాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నానని అన్నారు. 

నారాయణ్‌ దాస్‌ ఇకలేరనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని మ‌హేశ్ బాబు ట్వీట్ చేశారు. టాలీవుడ్ ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. నారాయణ్‌ దాస్‌తో కలిసి పనిచేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. వీవీ వినాయ‌క్‌, సుధీర్ బాబు, సుషాంత్, శివ కార్తికేయ‌న్‌, మెహ‌ర్ ర‌మేశ్‌తో పాటు ప‌లువురు సినీప్ర‌ముఖులు కూడా నారంగ్ మృతి ప‌ట్ల సంతాపం తెలిపారు. 



More Telugu News