ఇండియాలో ఒకే రోజు 4 లక్షల మంది విమాన ప్రయాణం

  • కరోనా తర్వాత రోజువారీ గరిష్ఠ రికార్డు ఇదే
  • అంతకుముందు స్థాయికి చేరిక
  • వైరస్ కేసులు తగ్గిపోవడం సానుకూలం
  • పర్యటనలకు ప్రాధాన్యం ఇస్తున్న ప్రజలు
విమాన ప్రయాణాలు మళ్లీ ఊపందుకున్నాయి. కరోనా కేసులు గణనీయంగా తగ్గిపోవడంతో ప్రజలు వేసవి విహారాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కరోనాతో 2020 ఏప్రిల్ నుంచి విమాన సర్వీసులపై పెద్ద ఎత్తున ప్రభావం పడడం తెలిసిందే. ఆ తర్వాత కరోనా పలు విడతలుగా విరుచుకుపడింది. దీంతో ఎయిర్ లైన్స్ పరిమిత సర్వీసులనే నడిపించాల్సి వచ్చింది. 

గత ఆదివారం (ఏప్రిల్ 17) ఒక్కరోజే దేశవ్యాప్తంగా విమాన సర్వీసుల్లో 4 లక్షల మంది ప్రయాణించారు. కరోనాకు ముందు నాటి రోజువారీ విమాన ప్రయాణికుల్లో ఇది 96 శాతానికి సమానం. దీంతో ఎయిర్ లైన్స్ సంస్థల్లో ఉత్సాహం నెలకొంది. అంతకుముందు రెండు వేసవి సీజన్లలో కరోనా రెండు విడతలుగా దేశాన్ని చుట్టేయడం తెలిసిందే. దీంతో ప్రజలు ప్రయాణాలు, పర్యటనలను తగ్గించుకోవడం, వాయిదా వేసుకోవడం చేశారు.

ఈ విడత కరోనా కేసులు పెద్దగా లేకపోవడం, లాక్ డౌన్ లు, ఇతర ఆంక్షలన్నీ తొలగిపోవడం, పండుగలు, వరుస సెలవులు అన్నీ కలసి ప్రయాణికుల సంఖ్యను గరిష్ఠ స్థాయికి తీసుకెళ్లాయని చెప్పుకోవాలి. వేసవి సీజన్ వచ్చే ఏడు వారాల్లో ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.


More Telugu News