ఏ5గా టీజీ వెంక‌టేశ్‌.. బంజారాహిల్స్ భూ వివాదంలో ఎంపీపై కేసు

  • 80 మంది పేర్ల‌తో రిమాండ్ రిపోర్ట్‌
  • టీజీ సోద‌రుడు విశ్వ‌ప్ర‌సాద్‌పైనా కేసు
  • పీపుల్ టెక్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారే దాడి చేశార‌న్న రిపోర్ట్‌
రాయ‌ల‌సీమ‌కు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌, ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేశ్‌పై పోలీసు కేసు న‌మోదైంది. ఆదివారం తెల్ల‌వారుజామున హైద‌రాబాద్ ప‌రిధిలోని బంజారాహిల్స్‌కు చెందిన ఏపీ జెమ్స్ అండ్ జ్యువెల్ల‌ర్స్ కు చెందిన స్థ‌లాన్ని క‌బ్జా చేసేందుకు టీజీ సోద‌రుడి కుమారుడు మందీ మార్బ‌లంతో వ‌చ్చార‌న్న వార్త‌లు క‌ల‌క‌లం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం  అందుకున్న త‌క్ష‌ణ‌మే స్పందించిన పోలీసులు 60 మందికి పైగా నిందితుల‌ను అరెస్ట్ చేశారు. 

తాజాగా ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌ను సిద్ధం చేశారు. ఈ రిమాండ్ రిపోర్ట్‌లో టీజీ వెంక‌టేశ్‌ను ఏ5 నిందితుడిగా చేర్చారు. ఇక టీజీ సోద‌రుడి కుమారుడు టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, సుభాష్ పులిశెట్టి, మిథున్‌, వీవీఎస్ శ‌ర్మ స‌హా 80 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ఈ రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు ప‌లు కీల‌క విష‌యాల‌ను పొందుప‌రిచారు.

రిమాండ్ రిపోర్ట్ ప్ర‌కారం.. ఏపీ జెమ్స్ అండ్ జ్యువెల్ల‌రీ పార్క్ స్థ‌లంలో 80 మంది నిందితులు అక్ర‌మంగా ప్ర‌వేశించారు. జేసీబీలు, హాకీ స్టిక్‌ల‌తో చొచ్చుకెళ్లేందుకు య‌త్నించారు. ఏపీ జెమ్స్ అండ్ జ్యువెల్ల‌రీ పార్క్‌లోని ఆ సంస్థ ప్రాప‌ర్టీని ధ్వంసం చేసేందుకు య‌త్నించారు. అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేశారు. పీపుల్ టెక్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారే దాడి చేశార‌ని ఏపీ జెమ్స్ అండ్ జ్యువెల్ల‌రీ పార్క్ సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. 2021 ఫిబ్రవ‌రిలోనూ ఇదే త‌రహాలో దాడుల‌కు య‌త్నించారు.


More Telugu News