ఐపీఎల్ పై వచ్చిన పుస్త్తకం ఆధారంగా సినిమా నిర్మించేందుకు టాలీవుడ్ నిర్మాత సన్నాహాలు

  • బయోపిక్ స్పెషలిస్ట్ గా పేరుగాంచిన విష్ణువర్ధన్ ఇందూరి
  • ఐపీఎల్ మాజీ కమిషనర్ పై చిత్రం
  • గతంలో లలిత్ మోదీపై పుస్తకం
  • త్వరలో ఇతర వివరాలు ప్రకటిస్తామన్న ఇందూరి
టాలీవుడ్ నిర్మాత విష్ణువర్ధన్ ఇందూరి గురించి చెప్పాల్సి వస్తే ఆయనను బయోపిక్ స్పెషలిస్ట్ అనొచ్చేమో! ఎందుకంటే ఆయన ఇప్పటివరకు తీసిన చిత్రాలన్నీ నిజ జీవితగాథలే కావడం విశేషం. ఎన్టీఆర్, జయలలిత బయోపిక్ లను నిర్మించింది ఆయనే. ఇటీవలే '83' అనే స్పోర్ట్స్ చిత్రాన్ని కూడా రూపొందించారు. కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత జట్టు 1983లో వరల్డ్ కప్ గెలవడం, దాని నేపథ్యం, కపిల్ జీవితం వంటి అంశాలను '83' చిత్రంలో చూపించారు. 

తాజాగా, విష్ణువర్ధన్ ఇందూరి మరో రియల్ లైఫ్ స్టోరీని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను బంగారు గుడ్లు పెట్టే బాతుగా మలిచిన ఘనత అప్పటి ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోదీకి దక్కుతుంది. ఐపీఎల్ కాన్సెప్ట్ ఆయనదే. అయితే లలిత్ మోదీ అవినీతి ఆరోపణల కారణంగా సస్పెన్షన్ కు గురై తెరమరుగయ్యాడు. 

లలిత్ మోదీ ఉదంతం ఆధారంగా స్పోర్ట్స్ జర్నలిస్ట్ బోరియా మజుందార్ 'మావెరిక్ కమిషనర్: ది ఐపీఎల్-లలిత్ మోదీ సాగా' అనే పుస్తకం రచించారు. ఇప్పుడీ పుస్తకాన్నే విష్ణువర్ధన్ ఇందూరి సినిమాగా నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ప్రకటన చేశారు. త్వరలోనే ఇతర వివరాలు ప్రకటిస్తామని, ప్రస్తుతం స్క్రిప్టుపై కసరత్తులు జరుగుతున్నాయని విష్ణువర్ధన్ వెల్లడించారు.


More Telugu News