కృష్ణ, నేను ఇంటర్ లో క్లాస్ మేట్స్: మురళీమోహన్

  • కాలేజీలో కృష్ణ చాలా అందగాడన్న మురళీమోహన్ 
  • అప్పట్లో కృష్ణ అభిమానులు తనను కొట్టడానికి వచ్చారని వెల్లడి 
  • కృష్ణ అంతటి మంచి మనిషిని తానెప్పుడూ చూడలేదని ప్రశంస 
తెలుగు సినీపరిశ్రమలో మురళీమోహన్ కు ఉన్న ప్రత్యేకత వేరు. కృష్ణ, శోభన్ బాబు వంటి వారు ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన మురళీమోహన్... తక్కువ కాలంలోనే హీరోగా గుర్తింపును తెచ్చుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. మరోవైపు నిర్మాతగా మారి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఇక మురళీ మోహన్ కు కృష్ణతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. 

కృష్ణ, తాను ఇంటర్ లో క్లాస్ మేట్స్ అని మురళీ మోహన్ తెలిపారు. ఆ రోజుల్లో కాలేజీలో కృష్ణ చాలా అందగాడని, అందరూ ఆయన చుట్టూనే తిరిగే వారని చెప్పారు. కాలేజీ చదువు అయిపోయిన వెంటనే ఆయన 'తేనెమనసులు' సినిమాతో హీరోగా మారారని... ఆ తర్వాత సూపర్ స్టార్ గా ఎదిగారని అన్నారు. 

తాను కూడా సినీ పరిశ్రమలో అడుగుపెట్టానని... నటన వైపు నుంచి నిర్మాతగా మారానని... కృష్ణ, నాగార్జున కాంబినేషన్లో 'వారసుడు' అనే సినిమాను నిర్మించానని చెప్పారు. అయితే ఈ సినిమాలో తండ్రి కృష్ణను కుమారుడు నాగార్జున నిలదీసే సన్నివేశం ఉందని... ఆ సీన్ చూసిన కృష్ణ అభిమానులు తమ ఇంటి మీదకు గొడవకు వచ్చారని, తనను కొట్టేందుకు కూడా రెడీ అయ్యారని వెల్లడించారు. ఇది ఒక సినిమా అని, దీన్ని కథగానే చూడాలని చెప్పినప్పటికీ వారు వినలేదని తెలిపారు. కృష్ణ అంటే ఫ్యాన్స్ కి అంత అభిమానమని చెప్పారు. 

వ్యక్తిగతంగా కృష్ణ చాలా గొప్ప వ్యక్తి అని కొనియడారు. ఆయన నిర్మాతల హీరో అని... సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతను ఇంటికి పిలిచి, మరో సినిమా అవకాశం ఇచ్చేవాడని చెప్పారు. డబ్బులు లేవని నిర్మాత చెపితే, ముందు సినిమా మొదలు పెట్టండి, మిగిలినవి తర్వాత చూసుకుందామని చెప్పేవారని అన్నారు. అంత మంచి మనిషిని తాను ఇంత వరకు చూడలేదని అన్నారు.


More Telugu News