ఏపీ ప్ర‌భుత్వం డొల్ల ప్రక‌ట‌న‌లు చేస్తోంది: సోము వీర్రాజు

  • పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర స‌ర్కారు రూ.49 వేల కోట్లు ఖర్చు చేసింద‌న్న వీర్రాజు
  • జగన్ మౌలిక వసతుల కల్పనపై చేస్తోన్న ప్ర‌క‌ట‌న‌ల్లో నిజాలు లేవ‌ని ఆరోప‌ణ‌
  • ఎక్కడ వసతులు కల్పించారు? అని ప్ర‌శ్న‌
  • ప్ర‌ధాని కట్టించే ఇళ్లు పూర్తి కాకుండానే పన్నులు వేసి దోచుకుంటున్నారని ఆగ్ర‌హం
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు మండిప‌డ్డారు. విజయవాడ, కృష్ణలంక ప్రాంతంలో నిర్వహించిన స్వచ్ఛ‌ భారత్ కార్యక్ర‌మంలో సోము వీర్రాజు పాల్గొని మీడియాతో మాట్లాడుతూ... పేదలకు ఇళ్ల నిర్మాణానికి కేంద్ర స‌ర్కారు రూ.49 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆయన చెప్పారు. అయితే, ఏపీ సీఎం జగన్ మౌలిక వసతుల కల్పనకు ఇప్ప‌టికే తాము రూ.32 వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పార‌ని, ఎక్కడ వసతులు కల్పించారని ఆయ‌న ప్ర‌శ్నించారు. 

ప్ర‌ధాని కట్టించే ఇళ్లు పూర్తి కాకుండానే పన్నులు వేసి దోచుకుంటున్నారని ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఏపీ ప్ర‌భుత్వం డొల్ల ప్రకటనలు చేస్తోంద‌ని, ఇలాంటి డొల్ల ప్రభుత్వంతో ప్రజలు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నార‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌భుత్వం గొప్ప‌లు చెప్పుకుంటూ ప్రకటనలకే పరిమితం అవుతోంద‌ని, తాను వైసీపీ స‌ర్కారుకి స‌వాలు విసురుతున్నాన‌ని, 32వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో చూపించాలని ఆయ‌న అన్నారు. 

ఆయా ప‌నులు, ప్రాజెక్టుల‌పై పరిశీలన చేసి రాష్ట్ర ప్రభుత్వం చేసే మోసాలను ప్రజలకు వివరిస్తామ‌ని అన్నారు. అలాగే, స్వచ్ఛ భారత్‌లో భాగంగా ప్ర‌తి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ. వెయ్యి కోట్ల చొప్పున‌ కేటాయించిందని పేర్కొన్నారు. ఏపీలో స్వచ్ఛ‌ భారత్ ఎలా జరుగుతుందో పరిశీలించామని ఆయ‌న చెప్పారు. ఏపీ‌లో స్వచ్ఛ‌ భారత్ నిధులను కూడా స‌రైన రీతిలో ఖర్చు పెట్టడం లేదని ఆరోపించారు. స్వచ్ఛ‌ భారత్ ను స‌మ‌ర్థంగా నిర్వ‌హిస్తే వ్యాధులు తగ్గుతాయని, వైద్య ఆరోగ్య శాఖకు వ్యయం కూడా తగ్గుతుందని అన్నారు.


More Telugu News