కనిపించకుండా పోయిన మాజీ హోంగార్డు శవమై కనిపించాడు!

  • భువనగిరిలో శుక్రవారం నుంచి మిస్సింగ్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
  • సిద్ధిపేట జిల్లాలో మృతదేహం లభ్యం
  • హత్య చేసి ఉంటారని భావిస్తున్న పోలీసులు
భువనగిరిలో గత శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన మాజీ హోంగార్డు రామకృష్ణగౌడ్ విగతజీవుడిలా దర్శనమిచ్చాడు. సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం లక్డారం వద్ద అతడి మృతదేహం లభ్యమైంది. ప్రాథమిక పరిశీలన అనంతరం రామకృష్ణ గౌడ్ హత్యకు గురైనట్టు భావిస్తున్నారు. 

అయితే, రామకృష్ణ గౌడ్ రెండేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్న నేపథ్యంలో ఇది పరువు హత్య అయ్యుండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, రామకృష్ణ గౌడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండడంతో, వ్యాపారంలో శత్రువులు ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. 

రామకృష్ణ గౌడ్ స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లాలోని లింగరాజుపల్లె. అతడు గతంలో యాదగిరిగుట్టలో హోంగార్డుగా విధులు నిర్వర్తించాడు. అయితే గుప్తనిధుల కేసులో ఉన్నతాధికారులు అతడిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆ తర్వాత 2020లో గౌరాయిపల్లికి చెందిన భార్గవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇరువురి కులాలు వేరు కావడంతో భార్గవి తల్లిదండ్రులు రామకృష్ణ గౌడ్ తో గొడవపడినట్టు తెలిసింది. అయితే భర్తతోనే ఉండాలని నిర్ణయించుకున్న భార్గవి... తండ్రి ఆస్తిలో తనకు వాటా అక్కర్లేదంటూ ఓ పత్రంపై రాసిచ్చినట్టు వెల్లడైంది. 

రామకృష్ణ, భార్గవి గత కొన్నినెలలుగా భువనగిరిలో నివాసం ఉంటున్నారు. చివరిగా లతీఫ్ అనే వ్యక్తితో కలిసి బయటికి వెళ్లిన రామకృష్ణ గౌడ్ తిరిగి ఇంటికి రాలేదు. భార్గవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. కాగా, రామకృష్ణ, భార్గవిలకు ఓ కుమార్తె ఉంది.


More Telugu News