ఒకినవా ప్రైజ్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లు వెనక్కి.. బ్యాటరీ లోపాల తనిఖీ

  • ఎలక్ట్రిక్ స్కూటర్లలో అగ్ని ప్రమాదాలు
  • దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నమోదు
  • భద్రత దృష్ట్యా ఒకినవా ముందు జాగ్రత్త నిర్ణయం
  • ప్రకటన విడుదల చేసిన కంపెనీ
ఒకినవా ఎలక్ట్రిక్ ప్రైజ్ ప్రో స్కూటర్ ను వినియోగిస్తున్న వారు గమనించాల్సిన విషయం ఇది. 3,215 యూనిట్లను (ఒక స్కూటర్ ను ఒక యూనిట్ గా పిలుస్తారు) వెనక్కి పిలిపించాలని ఒకినవా ఆటో టెక్ నిర్ణయం తీసుకుంది. ఇలా వెనక్కి పిలిపించిన అన్ని స్కూటర్ల లోనూ లోపాలను చెక్ చేసి సరి చేయనుంది. ముఖ్యంగా బ్యాటరీకి సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నాయేమో పరీక్షించనుంది. 

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇటీవల కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లలో బ్యాటరీ కారణంగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకినవా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ‘‘ఇటీవల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం, కస్టమర్ల భద్రతకు కట్టుబడి ఉన్నందున స్కూటర్లను స్వచ్చందంగా వెనక్కి పిలిపిస్తున్నాం’’అంటూ కంపెనీ తెలిపింది.

‘‘వెనక్కి పిలిపించిన స్కూటర్లలో బ్యాటరీ కనెక్షన్లను తనిఖీ చేస్తాం. లూజ్ కనెక్షన్లు ఉన్నాయా లేక ఏదైనా డ్యామేజీ ఉందేమో చూస్తాం. ఉంటే సరి చేసి ఇస్తాం. దేశవ్యాప్తంగా ఒకినవా ఆథరైజ్డ్ డీలర్ షిప్ ల వద్ద ఇది ఉచితంగా చేసిస్తాం’’అని ఒకినవా ఆటోటెక్ తెలిపింది. కస్టమర్ల సౌకర్యానికి ప్రాధాన్యం ఇవ్వాలంటూ ఈ విషయంలో డీలర్లకు సూచనలు ఇచ్చింది. కస్టమర్లను వారి ఫోన్ నంబర్లర్లో సంప్రదించనున్నట్టు తెలిపింది.


More Telugu News