అతడో విలన్.. ఆస్ట్రేలియా క్రికెటర్ పై కృష్ణమాచారి శ్రీకాంత్ మండిపాటు

  • నిన్న ఆర్సీబీతో ఢిల్లీ మ్యాచ్ 
  • 16 పరుగులతో ఓటమి
  • 24 బంతుల్లో 14 పరుగులే చేసిన మార్ష్
  • అశ్విన్ లా రిటైర్డ్ అవుట్ గా వెళ్లాల్సిందన్న శ్రీకాంత్
నిన్న ఐపీఎల్ లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయి ఉండొచ్చుగానీ.. తొలుత రేస్ లో ఉన్నది మాత్రం ఆ జట్టే. ఎందుకంటే.. 190 పరుగుల లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే పృథ్వీ షా వికెట్ కోల్పోయినా ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్ ధనాధన్ బ్యాటింగ్ తో అవసరమైన రన్ రేట్ తగ్గకుండా పరుగులు చేసింది. అప్పటివరకు తడబడని జట్టు ఒక్కసారిగా వెనకబడిపోయింది. 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. 

దానికి కారణం ఎవరంటే అన్ని వేళ్లూ ఒకే ఒక్క ఆటగాడిని చూపిస్తున్నాయి. అతడే మిషెల్ మార్ష్. ఈ సీజన్లో అతడు తొలి మ్యాచ్ ఆడుతున్నాడు. ఢిల్లీ తరఫునా తొలి మ్యాచే. అయితే, షా అవుటైన తర్వాత వచ్చిన అతడు 24 బంతుల్లో కేవలం 14 పరుగులే చేశాడు. అందులో 11 డాట్ బాల్స్ ఉన్నాయి. ఆ పరుగులన్నీ సింగిల్స్ రూపంలోనే వచ్చాయి. 

ఈ క్రమంలోనే టీమిండియా మాజీ దిగ్గజం కృష్ణమాచారి శ్రీకాంత్ మాత్రం అతడిపై ఓ రేంజ్ లో మండిపడ్డాడు. అతడో విలన్ లా దాపురించాడని అసహనం వ్యక్తం చేశాడు. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో అశ్విన్ రిటైర్డ్ అవుట్ అయినట్టు.. మిషెల్ మార్ష్ కూడా వికెట్ ను త్యాగం చేసి ఉండాల్సిందన్నాడు. 

వెనకాల ఎంత బ్యాటింగ్ డెప్త్ ఉన్నా.. రన్ రేట్ 14 దాకా ఉంటే ఎవరూ ఏం చేయలేరని అన్నాడు. రిషభ్ పంత్ బాగానే ప్రయత్నించినా అది వీలుకాలేదన్నాడు. తన వరకు ఢిల్లీ ఓటమికి కారణం మిషెల్ మార్షేనని, అతడే విలన్ అని అన్నాడు. 

అయితే, రిషభ్ పంత్ మాత్రం మిషెల్ మార్ష్ ను వెనకేసుకొచ్చాడు. అతడి వల్లే ఓడిపోలేదన్నాడు. మధ్య ఓవర్లలో బాగా ఆడాల్సిందని, బౌలింగ్ బాగా వేయాల్సిందని చెప్పాడు. ముస్తాఫిజుర్ వేసిన ఆ ఒక్క ఓవర్ తమ మ్యాచ్ ను మలుపు తిప్పిందన్నాడు.


More Telugu News