చట్టం కంటే మతం పెద్దది కాదు.. ముస్లింలు అర్థం చేసుకోవాలి: రాజ్ థాకరే

  • ముస్లింల ప్రార్థనలకు వ్యతిరేకం కాదు
  • మహారాష్ట్రలో అల్లర్లను కోరుకోవడం లేదు
  • ప్రార్థనలను లౌడ్ స్పీకర్లు లేకుండా చేసుకోవాలి
  • ఎంఎన్ఎస్ అధినేత సూచనలు
మసీదులపై లౌడ్ స్పీకర్లకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపిస్తున్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరే ఈ విషయంలో తన వైఖరిపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. ముస్లింలు ప్రార్థనలు నిర్వహించడానికి తాను వ్యతిరేకం కాదని, మహారాష్ట్రలో తన పార్టీ ఎలాంటి అల్లర్లు కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ‘‘కానీ మీరు ప్రార్థనలను లౌడ్ స్పీకర్లలో నిర్వహిస్తే అప్పుడు మేము కూడా లౌడ్ స్పీకర్లను వినియోగించాల్సి వస్తుంది. చట్టం కంటే మతం పెద్దది కాదన్న విషయాన్ని ముస్లింలు గుర్తించాలి’’అని రాజ్ థాకరే పేర్కొన్నారు.

అన్ని మసీదులపై లౌడ్ స్పీకర్లను తొలగించాల్సిందేనని, లేదంటే మసీదుల ఎదుట హనుమాన్ చాలీసా పారాయణాన్ని స్పీకర్లలో వినిపిస్తామంటూ రాజ్ థాకరే లోగడే హెచ్చరించారు. మే 3 నాటికి లౌడ్ స్పీకర్లను తొలగించాలని మహారాష్ట్ర సర్కారుకు గడువు కూడా పెట్టారు. దీనిపై తాజాగా స్పందిస్తూ మే 3 తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని పేర్కొన్నారు. 

రాజ్ థాకరే వైఖరిని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ తీవ్రంగా తప్పుబట్టడం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లో అసదుద్దీన్ చేస్తున్న పనినే మహారాష్ట్రలో రాజ్ థాకరే చేస్తున్నారంటూ విమర్శించారు. ‘‘మహారాష్ట్రలో శాంతిని చెడగొడదామన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, ఇక్కడి ప్రజలు, పోలీసులు శాంతియుతులు. రామ్, హనుమాన్ పేరుతో కొత్త ఒవైసీ.. హిందూ ఒవైసీ అల్లర్లు సృష్టించే కార్యక్రమంతో ఉన్నారు’’అని రౌత్ వ్యాఖ్యానించారు.


More Telugu News