హనుమాన్ శోభాయాత్రపై రాళ్లదాడి.. ఢిల్లీలో మత ఘర్షణలు

  • నిన్న సాయంత్రం ఇరు వర్గాల మధ్య ఘర్షణ
  • జహంగీర్ పురిలో ఉద్రిక్త పరిస్థితులు
  • ఇవాళ ఐదుగురు సహా 14 మంది అరెస్ట్
  • అరెస్టయిన వారిలో అల్లర్ల సూత్రధారి
హనుమాన్ జయంతి సందర్భంగా నిన్న సాయంత్రం ఢిల్లీలోని జహంగీర్ పురిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఓ వర్గం వారు శోభాయాత్రపై రాళ్ల దాడి చేయడంతో మరో వర్గం వారు తిరిగి దాడి చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఘటనలో 8 మంది పోలీస్ సిబ్బంది, ఒక పౌరుడు గాయపడ్డారు. 

ఈ కేసుకు సంబంధించి ఇవాళ ఉదయం ఐదుగురు సహా మొత్తం 14 మందిని అరెస్ట్ చేశామని నార్త్ వెస్ట్ డీసీపీ ఉషా రంగ్నానీ చెప్పారు. అందులో అల్లర్ల ప్రధాన సూత్రధారి కూడా ఉన్నారన్నారు. ప్రస్తుతం జహంగీర్ పురిలో పోలీస్ బందోబస్తును కట్టుదిట్టం చేశామన్నారు. అందరూ ప్రశాంతంగా ఉండేలా చూడాలంటూ అమాన్ కమిటీ మీటింగ్ లో డీసీపీ సూచించారు. 

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీటీవీ కెమెరాలతో ఎక్కడికక్కడ నిఘా పెంచారు. డ్రోన్లు, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్ వేర్ సాయంతో ఘర్షణలకు కారణమైన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. 

కాగా, ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందని, ముందు జాగ్రత్త చర్యగా ర్యాపిడ్ యాక్షన్ బలగాలను మోహరించామని పోలీసులు తెలిపారు. మరోవైపు జహంగీర్ పురి ఘటన తర్వాత యూపీ, ఢిల్లీ సరిహద్దుల్లోని సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 


More Telugu News