కరోనాతో పిల్లల్లో కనిపించే లక్షణాలు ఇవీ..?

  • గొంతు భాగంలో ఇన్ఫెక్షన్
  • వాంతులు చేసుకోవడం
  • అధిక స్థాయి జ్వరం
  • తలనొప్పి ఉంటే వైద్యులను సంప్రదించాలి
కరోనా ఒమిక్రాన్ వేరియంట్ సమయంలో పిల్లల్లో శ్వాసకోశ ఎగువ భాగంలో ఇన్ఫెక్షన్ ను ఎక్కువగా గుర్తించినట్టు తాజా అధ్యయనంలో తెలిసింది. వారి శ్వాసకోశ  మార్గాలు చిన్న పరిమాణంలో, కొంత కుచించుకుపోయినట్టు ఉండడం వల్ల కరోనా వైరస్ బారిన పడితే ముందు రిస్క్ శ్వాసకోశ ఎగువ భాగానికి ఉంటుందని పరిశోధకులు గుర్తించారు.

మనదేశంలో ఒమిక్రాన్ వేరియంట్ 2021 డిసెంబర్ లో మొదలై, 2022 మార్చిలో క్షీణదశను చూడడం తెలిసిందే. అప్పుడు కూడా మన దగ్గర చిన్నారుల్లో వైరస్ కేసులు పెద్దగా రాలేదు. కానీ, ప్రస్తుతం ఢిల్లీ చుట్టు పక్కల ప్రాంతాల్లో చిన్నారుల్లో ఎక్కువ కేసులు వెలుగు చూస్తున్నాయి. పాఠశాలలు తిరిగి తెరవడంతో చిన్నారులకూ వైరస్ రిస్క్ పెరిగినట్టు కనిపిస్తోంది. కరోనా వైరస్ తో ఢిల్లీలో 51 మంది ఆసుపత్రుల్లో చేరితే, వారిలో 14 మంది పిల్లలు ఉన్నారు.

వైద్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. కరోనా వైరస్ బారిన పడిన చిన్నారుల్లో వాంతులు చేసుకోవడం, ఆ తర్వాత అధిక స్థాయి జ్వరం కనిపిస్తోంది. కొంచెం పెద్ద పిల్లలు తలనొప్పి కూడా ఉన్నట్టు చెబుతున్నారు. అయితే చిన్నారుల్లో కరోనా వైరస్ తీవ్రత కేసులు చాలా తక్కువ అని పీడియాట్రిక్స్ డాక్టర్ అనామికా దూబే తెలిపారు. 

యూఎస్ సీడీసీ డేటా ప్రకారం చూస్తే.. ప్రతి 14,085 మంది చిన్నారుల్లో కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చేది ఒక్కరే. తీవ్ర లక్షణాలు కోటి మందిలో ఒకరిలోనే కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అయినాకానీ, శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం, వేగంగా శ్వాస తీసుకుంటూ ఉండడం, పెదాలు, ముఖం రంగు మారుతుండడం, ఛాతీలో నొప్పి, అసౌకర్యంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.


More Telugu News