ఢిల్లీ ఉపహార్ సినిమా థియేటర్ లో మరోసారి అగ్ని ప్రమాదం

  • ఇవాళ తెల్లవారు జామున చుట్టుముట్టిన అగ్నికీలలు
  • ప్రాణ నష్టం జరగలేదని అధికారుల ప్రకటన
  • ఐదు ఫైరింజన్లతో మంటలను ఆర్పిన సిబ్బంది
  • 25 ఏళ్ల నాటి ప్రమాదంలో 59 మంది మృతి
  • ఆ గాయం మానకముందే మరో ప్రమాదం
ఉపహార్ సినిమా థియేటర్ అగ్ని ప్రమాదం గుర్తుందా? ఆ ప్రమాదం గురించి తెలుసా? 1997 జూన్ 13న మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని థియేటర్ లో మంటలు వ్యాపించి 59 మంది చనిపోయారు. ప్రమాదం వల్ల జరిగిన తొక్కిసలాటలో మరో 103 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికీ ఆ గాయం తాలూకు మరకలు ఇంకా చెరిగిపోలేదు. 

తాజాగా అదే థియేటర్ లో ఇవాళ మరో అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రీన్ పార్క్ మెట్రో స్టేషన్ వద్దనున్న థియేటర్ లో తెల్లవారుజామున 4.46 గంటలకు అగ్నికీలలు థియేటర్ ను చుట్టుముట్టాయి. ఐదు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పాయి. అదృష్టం కొద్దీ తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. థియేటర్ లో మూలకు పడి ఉన్న ఫర్నీచర్ కు నిప్పు అంటుకుని మంటలు వ్యాపించాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. థియేటర్ బాల్కనీ, ఫ్లోర్ బాగా దెబ్బతిన్నాయన్నారు. ఉదయం 7.20 గంటలకు మంటలు అదుపులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. 

కాగా, 25 ఏళ్ల కింద అదే థియేటర్ లో జరిగిన ప్రమాదం కేసు మొన్నటిదాకా కోర్టులో నలుగుతూనే ఉంది. 2015 ఆగస్టు 19న ఢిల్లీ కోర్టు థియేటర్ యజమాని సుశీల్ అన్సాల్ సోదరులకు రూ.30 కోట్ల చొప్పున జరిమానా విధించింది. గత ఏడాది నవంబర్ లో తుది తీర్పు వెలువరించిన కోర్టు.. ఆధారాలను నాశనం చేశారన్న ఆరోపణలపై అన్సాల్ సోదరులకు ఏడేళ్ల జైలు శిక్ష, మరో రూ.2.25 కోట్ల జరిమానా విధించింది.


More Telugu News