ఆల్‌రౌండ్ షోతో ఢిల్లీని చిత్తుచేసిన బెంగళూరు.. మూడో స్థానానికి డుప్లెసిస్ సేన

  • మరోమారు మెరుపులు మెరిపించిన కార్తీక్
  • డేవిడ్ వార్నర్ మినహా రాణించలేకపోయిన ఢిల్లీ బ్యాటర్లు
  • 8వ స్థానానికి దిగజారిన ఢిల్లీ
మ్యాక్స్‌వెల్ సమయోచిత అర్ధ సెంచరీకి తోడు దినేశ్ కార్తీక్ మరోమారు మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ కేపిటల్స్ తో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 190 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ కేపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 173 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. డేవిడ్ వార్నర్ అర్ధ సెంచరీ (38 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 పరుగులు) సాధించినప్పటికీ మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో విజయం ముంగిట బోర్లా పడింది. మ్యాక్స్‌వెల్ తర్వాత కెప్టెన్ రిషభ్ పంత్ సాధించిన 34 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. బెంగళూరు బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ 3, మహ్మద్  సిరాజ్ రెండు వికెట్లు తీసుకున్నాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ తొలుత తడబడింది. 75 పరుగులకే అనూజ్ రావత్ (0), కెప్టెన్ డుప్లెసిస్ (8), విరాట్ కోహ్లీ (12), ప్రభుదేశాయ్ (6) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో మ్యాక్స్‌వెల్ ఆపద్బాంధవుడయ్యాడు. 34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసి జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశారు. చివర్లో షాబాజ్ అహ్మద్ అండగా కార్తీక్ మరోమారు చెలరేగిపోయాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 పరుగులు చేసి స్కోరును పరుగులు పెట్టించాడు. షాబాజ్ 21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 32 పరుగులు చేయడంతో బెంగళూరు 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేయగలిగింది. మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన దినేశ్ కార్తీక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ విజయంతో ఆర్సీబీ 8 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకింది. ఢిల్లీ కేపిటల్స్ 8వ స్థానానికి దిగజారింది.


More Telugu News