టైం సెన్స్ లేక‌పోతే ఎలా?.. టీ కాంగ్రెస్ సీనియ‌ర్ల‌కు ఠాగూర్ క్లాస్‌!

  • రాహుల్ గాంధీ టూర్‌పై మాణిక్కం ఠాగూర్ స‌మావేశం
  • భేటీకి గంట‌న్న‌ర ఆల‌స్యంగా నేత‌ల రాక‌
  • ఆల‌స్యంపై సీనియ‌ర్ల‌కు మాణిక్కం ఠాగూర్ క్లాస్‌
  • ఇక‌పై ఇలా కుద‌రదంటూ వార్నింగ్  
కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ శాఖ‌ (టీపీసీసీ)కు సంబంధించిన శ‌నివారం జ‌రిగిన స‌మావేశం హాట్ హాట్‌గా సాగింది. తెలంగాణ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ పార్టీ సీనియ‌ర్ల‌కు ఫుల్ క్లాస్ పీకారు. టైం సెన్స్ లేక‌పోతే ఎలాగంటూ ఆయ‌న ప్ర‌శ్నించ‌డంతో పార్టీ సీనియ‌ర్లు జానారెడ్డి, వి. హనుమంత‌రావు త‌దిత‌రులంతా షాక్ తిన్నార‌ని తెలుస్తోంది‌. 

తెలంగాణ‌లో పార్టీ కీల‌క నేత రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న గురించి చ‌ర్చించేందుకు మాణిక్కం ఠాగూర్ హైద‌రాబాద్‌లోని గాంధీ భ‌వ‌న్‌లో పార్టీ సీనియ‌ర్ల‌తో శ‌నివారం ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశం ఉద‌యం 11 గంట‌ల‌కు మొద‌ల‌వుతుంద‌ని స‌మాచారం ఇవ్వ‌గా... చాలా మంది నేత‌లు 12.30 గంట‌ల‌కు గానీ రాలేదు.

దీంతో పార్టీ నేత‌ల తీరును ప్ర‌శ్నించిన ఠాగూర్‌.. టైం సెన్స్ లేక‌పోతే ఎలాగంటూ నిల‌దీశారు. అంతేకాకుండా ఇక‌పై ఇలా కుద‌ర‌ద‌ని కూడా ఆయ‌న తేల్చి చెప్పారు. ఇక‌పై స‌మ‌య‌పాల‌న పాటించ‌క‌పోతే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని కూడా హెచ్చ‌రించారు. 11 గంట‌ల‌కు స‌మావేశ‌మ‌ని చెబితే 12.30 గంట‌ల‌కు రావ‌డ‌మేమిట‌ని ఆయ‌న నిల‌దీశారు. వ‌రుస‌గా మూడు స‌మావేశాల‌కు రాక‌పోతే నోటీసులు ఇస్తాన‌ని చెప్పిన ఠాగూర్‌.. అధిష్ఠానం అనుమ‌తితో ప‌ద‌వుల నుంచి కూడా త‌ప్పిస్తాన‌ని హెచ్చ‌రించారు.


More Telugu News