ఆచార్య నుంచి 'భలే భలే బంజారా' సాంగ్ విడుదలకు ముహూర్తం ఖరారు... "నువ్వు కాస్త తగ్గాలి" అంటూ చరణ్ కు చిరు వార్నింగ్

  • చిరంజీవి, కొరటాల కాంబోలో ఆచార్య
  • కీలకపాత్రలో రామ్ చరణ్
  • పాటకు సంబంధించిన చర్చలో పాల్గొన్న చిరు, చరణ్, కొరటాల
  • ఆసక్తికర సంభాషణలతో వీడియోను రక్తికట్టించిన వైనం
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే తదితరులు నటించిన ఈ భారీ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఆచార్య చిత్రం నుంచి మరో పాట సందడి చేసేందుకు సిద్ధమైంది. 'భలే భలే బంజారా' అంటూ సాగే ఈ హుషారైన గీతాన్ని ఏప్రిల్ 18న విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ వెల్లడించింది. అంతేకాదు, చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు కొరటాల శివల మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ వీడియోను కూడా పంచుకుంది. 

ఈ వీడియోలో... చిరంజీవి మాట్లాడుతూ, ఇటీవల రామ్ చరణ్ నాటు నాటు పాటకు ఎన్టీఆర్ తో కలిసి అదరగొట్టేశాడని, ఇప్పుడు అతడితో సమానంగా తాను సెట్స్ పై డ్యాన్స్ చేయగలనా అనే సందేహం కలుగుతోందని దర్శకుడు కొరటాల శివతో అన్నారు. దాంతో, రామ్ చరణ్ అందుకుని, ఆయన గ్రేస్ ముందు మేం సరిపోతామా అనే సందేహం తనకు కలుగుతోందని వ్యాఖ్యానించారు. 

దర్శకుడు కొరటాల శివ స్పందిస్తూ... చిరంజీవి, రామ్ చరణ్ ఓ పాటకు డ్యాన్స్ చేయనున్న నేపథ్యంలో సెట్స్ కు వచ్చి చూస్తామంటూ చాలామంది నుంచి ఫోన్లు వస్తున్నాయని వెల్లడించారు. సాధారణంగా సినిమా విడుదల అప్పుడు టికెట్లు కావాలని కోరడం చూస్తుంటామని, కానీ ఇలా సెట్స్ మీదకు వచ్చి చూస్తామని అడగడం ఇప్పుడే చూస్తున్నామని పేర్కొన్నారు. 

దీనిపై చిరంజీవి స్పందిస్తూ, తన అర్ధాంగి సురేఖ కూడా ఈ పాట చిత్రీకరణకు సెట్స్ మీదకు వస్తానని చెప్పిందని, తనకు అదొక టెన్షన్ పట్టుకుందని వెల్లడించారు. ఇలా లైవ్ ఆడియన్స్ ముందు, అది కూడా రామ్ చరణ్ వంటి ఎనర్జటిక్ డ్యాన్సర్ తో స్టెప్పులేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

కొరటాల శివ అక్కడ్నించి వెళ్లిపోయాక... రేయ్ చరణ్, ఏమనుకుంటున్నావ్ అని తనయుడ్ని ప్రశ్నించారు. నేను నీ బాబుని రా... నువ్వు రేపు సెట్స్ మీద తగ్గాలి అని అన్నారు. అయితే రామ్ చరణ్... అప్పా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గను అంటూ బదులిచ్చారు. దాంతో చిరంజీవి... చూద్దాం, సెట్స్ మీద ఏం జరుగుతుందో అంటూ వీడియోని రక్తి కట్టించారు.


More Telugu News