కడపలో ఐఏఎస్ అధికారిణి వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్

  • సత్యనారాయణరెడ్డిని పెళ్లాడిన నారపురెడ్డి మౌర్య
  • మౌర్య నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్
  • ఇటీవల సీఎం జగన్ కు ఆహ్వానం
  • కడప మేయర్ కుమార్తె వివాహానికి కూడా హాజరైన సీఎం
ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో పర్యటిస్తున్నారు. ఆయన ఇవాళ యువ ఐఏఎస్ అధికారిణి నారపురెడ్డి మౌర్య వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు. కడపలోని ఎన్జీవో కాలనీలో జరుగుతున్న ఈ వేడుకకు సీఎం రావడంతో సందడి నెలకొంది. వధూవరులు మౌర్య, సత్యనారాయణరెడ్డిలకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తన భర్త సత్యనారాయణరెడ్డిని మౌర్య సీఎం జగన్ కు పరిచయం చేశారు. ఆపై మౌర్య, సత్యనారాయణరెడ్డి సీఎం జగన్ పాదాలకు నమస్కరించగా, ఆయన కొత్త దంపతులను ఆశీర్వదించారు. 

నారపురెడ్డి మౌర్య ఇటీవల నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ గా నియమితులయ్యారు. ఆమె భర్త సత్యనారాయణరెడ్డి హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. ఇటీవల మౌర్య తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ ను పెళ్లికి ఆహ్వానించారు. వీరి పెళ్లి ఈ నెల 14న జరిగింది. 

అటు, కడప మేయర్ సురేశ్ బాబు కుమార్తె ఐశ్వర్య వివాహ వేడుకకు కూడా సీఎం జగన్ హాజరయ్యారు. ఈ వివాహ వేడుకకు ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, పార్టీ ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాశ్ రెడ్డి, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, ఇతర నేతలు విచ్చేశారు.

అంతేకాదు, సీఎం జగన్ కర్నూలు జిల్లాలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంగాటి ప్రదీప్ రెడ్డి కుమారుడు వంశీధర్ రెడ్డి వివాహ కార్యక్రమానికి కూడా హాజరయ్యారు.


More Telugu News