మీరు ఒత్తిడిలో ఉన్నారని తెలుసుకోవడం ఎలా..?

  • శారీరకంగా నొప్పులు, బాధలు
  • తలనొప్పి, మెడనొప్పి
  • అలసట, శక్తి తగ్గడం
  • జీర్ణపరమైన సమస్యలు
  • నిద్రలేమి.. ఇవన్నీ సంకేతాలే!
ఒత్తిడి ఆరోగ్యానికి చేటు చేస్తుంది. ఎన్నో సమస్యలను తెచ్చి పెడుతుంది. కానీ అది ఎక్కువైనప్పుడే. కొంచెం పరిమితంగా ఒత్తిడి ఉంటే అది మంచే చేస్తుంది. స్వల్ప పరిమాణంలో ఉంటే మెదడు చురుకుగా పనిచేస్తుంది. దీని మోతాదు పెరిగితేనే సమస్య. నెలలు, ఏళ్లపాటు అది కొనసాగితే అది గుండెకు చేసే నష్టం ఎక్కువగా ఉంటుంది. 

ఒత్తిడి వల్ల మన పనిలో ఉత్పాదకత తగ్గిపోతుంది. సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు బలహీనపడిపోతాయి. దాంతో నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. అందుకనే ఒత్తిడి లేకుండా జీవించాలి. ఒత్తిడి మనలో పెరుగుతుందనే దానికి కొన్ని సంకేతాలు సూచిస్తాయి. వాటిని గుర్తించిన తర్వాత అయినా దిద్దుబాటుకు ఉపక్రమించాలి.

నొప్పులు, బాధలు
శరీరంలో తెలియని నొప్పులు, బాధలు కనిపిస్తున్నాయంటే ఒత్తిడి వల్లేమోనని అనుమానించాలి. ఒత్తిడి ఎక్కువ అయిన సందర్భాల్లో ముఖ్యంగా మెడ భాగంలో నొప్పి వస్తుంది. అసాధారణ స్థాయిలో నొప్పి, బాధ కలుగుతుంటే అది ఒత్తిడి సంకేతమే అయి ఉంటుంది.

నిద్రలో సమస్యలు
ఒత్తిడిని ఎదుర్కొనే వారికి నిద్ర పట్టదు. తొందరగా నిద్ర పట్టదు. పట్టినా, ఎక్కువ సమయం పాటు నిద్రపోలేరు. ఒత్తిడి కారణంగా నిద్రలేమిని నిర్లక్ష్యం చేయవద్దు. ఇది ఇతర సమస్యలకు దారితీస్తుంది. వ్యాధినిరోధక శక్తి కూడా బలహీనపడుతుంది.

తరచూ తలనొప్పి
ఒత్తిడి తరచూ తలనొప్పికి దారితీస్తుంది. మైగ్రేన్ తలనొప్పి కూడా రావచ్చు. తరచూ తలనొప్పి కనిపిస్తుంటే దాన్ని ఒత్తిడి సంకేతమా? అని అనుమానించి వైద్య సలహా తీసుకోవాలి.

జీర్ణాశయ సమస్యలు
ఒత్తిడి జీర్ణ వ్యవస్థపైనా ప్రభావం చూపిస్తుంది. దాంతో తీసుకున్న ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ సజావుగా సాగదు. అజీర్ణం, గుండెలో మంట, మలబద్ధకం.. ఒక్కోసారి నీళ్ల విరేచనాలు ఇవన్నీ ఒత్తిడి వల్ల రావచ్చు.

అలసట, తక్కువ ఎనర్జీ
ఒత్తిడి పరిమితి దాటినప్పుడు శరీరం దానిపై ఫైట్ చేస్తుంది. ఇది అలసటకు దారితీస్తుంది. ఒత్తిడి కారణంగా శక్తి త్వరగా ఖర్చయిపోతుంది. దాంతో కూడా అలసట, నీరసంగా అనిపించొచ్చు.

అధిగమించేది ఎలా..?
ఇక్కడ చెప్పుకున్న వాటిల్లో ఏవి కనిపించినా ఒత్తిడిని తగ్గించుకునే చర్యలను వెంటనే ఆచరణలో పెట్టాలి. వ్యాయామాలు, యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం ఎన్నో మార్గాలున్నాయి. చివరికి వైద్యుల సలహా తీసుకోవడం కూడా పరిష్కారమే. నిత్య జీవితంలో ఎదురయ్యే అంశాలను ఎలా చూస్తున్నాం, వాటిని ఎలా పరిష్కస్తున్నాం? అనేవి ఒత్తిడిని నిర్ణయించే అంశాలు. అందుకే సాధ్యమైనంత మేర రిలాక్స్ గా ఉండేందుకు ప్రయత్నించాలి. సమస్య నుంచి బయటకు వచ్చేందుకు నిపుణుల సూచనలు తీసుకోవడానికి వెనుకాడొద్దు.


More Telugu News