ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాల ముందంజ.. బీజేపీ వెనుకంజ
- ఒక లోక్ సభ, నాలుగు శాసనసభ స్థానాల ఓట్ల లెక్కింపు
- పశ్చిమబెంగాల్లో తృణమూల్ హవా
- మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ ఆధిపత్యం
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తున్నాయి. బీజేపీ వెనుకబడడం గమనార్హం. పశ్చిమబెంగాల్లోని అసన్ సోల్ లోక్ సభ స్థానం, బల్లీగంజ్ శాసనసభ స్థానంతోపాటు.. చత్తీస్ గఢ్ లోని కైరాగఢ్, మహారాష్ట్రలోని కొల్హాపూర్, బిహార్ లోని బొచాహన్ శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. నేడు ఆయా స్థానాలలో ఓట్ల లెక్కింపు చేపట్టారు.
మధ్యాహ్నం సమయానికి పశ్చిమ బెంగాల్లోని అసన్ సోల్ స్థానంలో ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శతృఘ్న సిన్హా 1,70,000 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. అదే రాష్ట్రంలోని బల్లీగంజ్ అసెంబ్లీ స్థానంలో బాబుల్ సుప్రియో 8,500 ఓట్ల మెజారిటీ సాధించారు. వీరిద్దరూ బీజేపీని వీడి ఉప ఎన్నికల్లో తృణమూల్ టికెట్ పై పోటీ చేశారు.
బిహార్ లోని బొచాహన్ అసెంబ్లీ స్థానంలో మొదటి రౌండ్ లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, తర్వాత రౌండ్లకు వచ్చేసరికి లాలూప్రసాద్ కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఆధిక్యంలోకి వచ్చింది. చత్తీస్ గఢ్ లోని కైరాగఢ్ లో, మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది.