మంత్రి ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్ నిలిపివేత.. ఆసుపత్రికి తీసుకువెళుతున్న చిన్నారి మృతి

  • అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఘటన
  • మంత్రిగా బాధ్యతలు చేపట్టి పట్టణానికి వచ్చిన ఉషశ్రీ చరణ్
  • భారీ ఊరేగింపు కారణంగా ట్రాఫిక్ నిలిపివేత
  • పోలీసులు అడ్డుకోవడం వల్లే కుమార్తె మరణించిందంటున్న తల్లిదండ్రులు
  • అదేం లేదంటున్న పోలీసులు
అస్వస్థతకు గురైన 8 నెలల చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మంత్రి ఊరేగింపు కారణంగా పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. దీంతో సకాలంలో వైద్యం అందక ఆ చిన్నారి కన్నుమూసింది. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో జరిగిందీ ఘటన. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. శెట్టూరు మండలం చెర్లోపల్లికి చెందిన గణేశ్-ఈరక్క దంపతులకు 8 నెలల క్రితం పాప జన్మించింది. నిన్న సాయంత్రం చిన్నారి ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. దీంతో వెంటనే వారు ఆటోలో కళ్యాణదుర్గం బయలుదేరారు. 

అదే సమయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్థానిక ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ పట్టణానికి వస్తుండడంతో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. దీంతో చిన్నారితో వెళ్తున్న ఆటో పట్టణ శివారులో చిక్కుకుపోయింది. ఆలస్యం అవుతుండడంతో తెలిసినవారి బైక్‌పై చిన్నారిని తీసుకుని బయలుదేరారు. 15 నిమిషాల తర్వాత ఆసుపత్రికి చేరుకున్నారు.

అయితే, పాపను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేయకుంటే తమ కుమార్తె బతికేదని కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు తాము ఎవరినీ అడ్డుకోలేదని వివరణ ఇచ్చారు. చిన్నారి అస్వస్థతకు గురైందని తెలియగానే వెంటనే వారిని పంపించామని చెప్పారు.


More Telugu News