ఐకాన్ బ్రిడ్జి డీపీఆర్‌కు గ‌డ్క‌రీ ఆదేశం.. హ‌ర్షం వ్య‌క్తం చేసిన అమ‌రావ‌తి రైతులు

  • హైద‌రాబాద్ నుంచి నేరుగా అమ‌రావ‌తి వెళ్లేందుకు ఐకాన్ బ్రిడ్జి ప్ర‌తిపాద‌న‌
  • వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక అట‌కెక్కిన ప్ర‌తిపాద‌న‌
  • గ‌తవారం ఢిల్లీలో గ‌డ్క‌రీని క‌లిసిన అమ‌రావ‌తి రైతులు
  • ఐకాన్ బ్రిడ్జిని నిర్మించాల‌ని రైతుల‌తో పాటు ఎంపీ కేశినేని నాని విజ్ఞ‌ప్తి
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని విజ‌య‌వాడ‌- హైద‌రాబాద్ హైవేతో క‌లిపేందుకు ఉద్దేశించిన ఐకాన్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్‌ను రూపొందించాల‌ని కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ శుక్ర‌వారం నాడు అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం తెలిసిన వెంట‌నే రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు హ‌ర్షం వ్యక్తం చేశారు. 

టీడీపీ హయాంలో ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ఎంపిక చేసిన త‌ర్వాత‌.. అమ‌రావ‌తి వెళ్లాలంటే విజ‌య‌వాడ మీదుగా ఎక్కువ దూరం ప్ర‌యాణించాల్సి వ‌స్తున్న ఇబ్బందిపై నాటి ప్ర‌భుత్వం దృష్టి సారించింది. విజ‌య‌వాడ‌- హైదరాబాద్ హైవేపై ఉన్న‌ ఇబ్ర‌హీంప‌ట్నం నుంచి కృష్ణా న‌ది మీదుగా ఉద్ధండ‌రాయునిపాలెం వ‌ర‌కు ఐకాన్ బ్రిడ్జిని నిర్మిస్తే.. అమ‌రావ‌తి వెళ్లాల్సిన వారు విజ‌య‌వాడ‌ను ట‌చ్ చేయ‌కుండానే నేరుగా అమ‌రావ‌తికి వెళ్లే అవ‌కాశం ఉంటుంద‌ని తేల్చారు. 

అనుకున్న‌దే త‌డ‌వుగా ఐకాన్ బ్రిడ్జి నిర్మాణానికి ప్ర‌ణాళిక కూడా ర‌చించారు. అయితే 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం సాధించగా... సీఎంగా జ‌గ‌న్ వ‌చ్చిన త‌ర్వాత ఈ బ్రిడ్జి ప్ర‌తిపాద‌న అట‌కెక్కింది. ఈ క్ర‌మంలో గ‌త‌వారం ఢిల్లీ వెళ్లిన అమ‌రావ‌తి రైతులు మంత్రి నితిన్ గ‌డ్క‌రీని క‌లిశారు. 

అమ‌రావ‌తికి సంబంధించి ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించిన రైతులు.. కృష్ణా న‌దిపై ఐకాన్‌ బ్రిడ్జి నిర్మాణానికి చ‌ర్య‌లు తీసుకోవాలంటూ విన్న‌వించారు. అదే స‌మ‌యంలో రైతుల వెంట మంత్రి వ‌ద్ద‌కు వెళ్లిన విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని... ఐకాన్ బ్రిడ్జి ఆవ‌శ్య‌క‌త‌ను గ‌డ్క‌రీకి వివరించారు. ఈ ప్ర‌తిపాద‌న‌పై ప‌రిశీల‌న జ‌రిపిన మంత్రి ఐకాన్ బ్రిడ్జి డీపీఆర్‌ను రూపొందించాలంటూ శుక్ర‌వారం నాడు అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ విష‌యం తెలుసుకున్న రైతులు కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో పాటు విజ‌య‌వాడ ఎంపీ కేశినేనికి ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.


More Telugu News