'అమ్మ ఒడి'పై ఎలాంటి ఆంక్షలు విధించలేదు: మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టీకరణ

  • అమ్మ ఒడిపై కొత్తగా ఆంక్షలు అంటూ ప్రచారం
  • ప్రభుత్వంపై మండిపడుతున్న విపక్షాలు
  • తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న మంత్రి ఆదిమూలపు
  • ఆధారాలు చూపించాలని డిమాండ్
  • చంద్రబాబు, లోకేశ్ లపై ఆగ్రహం
అమ్మ ఒడి పథకంపై ప్రభుత్వం కొత్తగా ఆంక్షలు విధించిందంటూ జరుగుతున్న ప్రచారంపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. అమ్మ ఒడిపై తాము ఎలాంటి ఆంక్షలు విధించలేదని, మీడియాలోని ఓ వర్గం, చంద్రబాబు, లోకేశ్ లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 

ఏపీ ప్రజలు ఎప్పటికీ జగనే తమ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారని, అది ఓర్వలేకే కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. అమ్మ ఒడిపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది అంటున్న చంద్రబాబు, లోకేశ్ అందుకు ఆధారాలు చూపాలని ఆదిమూలపు డిమాండ్ చేశారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో టీడీపీ ఈ తరహా కుట్రలకు తెరలేపిందని మండిపడ్డారు. వంచనకు ప్రతిరూపం చంద్రబాబు అంటూ మంత్రి విమర్శించారు. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవ్యంగా లేకున్నా అమ్మ ఒడి ద్వారా రెండుసార్లు ఆర్థికసాయం అందించామని, వివిధ వర్గాలకు చెందిన 81 శాతం మహిళలకు అమ్మ ఒడి ద్వారా లబ్ది చేకూర్చామని వివరించారు. అమ్మ ఒడి పథకాన్ని దేశమంతా పొగుడుతోందని మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు.


More Telugu News