సీఎం కేసీఆర్‌పై వైఎస్ ష‌ర్మిల ఘాటు వ్యాఖ్య‌లు

  • ధాన్యం కొనుగోళ్లే ల‌క్ష్యంగా ష‌ర్మిల విమ‌ర్శ‌లు
  • కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌తో బీడుగా 17 ల‌క్ష‌ల ఎక‌రాలు
  • వ‌రి వేయ‌ని రైతుల‌కు ఎక‌రాకు రూ.25 చెల్లించాలి
  • త‌క్కువ ధ‌ర‌కు ధాన్యం అమ్ముకున్న వారికి ప‌రిహారం ఇవ్వాల‌న్న ష‌ర్మిల‌
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో యాసంగి ధాన్యం కొన‌బోమ‌ని ప్ర‌క‌టించిన కేసీఆర్‌... ఇప్పుడు ఆల‌స్యంగా ధాన్యం కొనుగోళ్ల‌కు తెర తీశార‌న్న ష‌ర్మిల‌.. ఇప్ప‌టికే త‌క్కువ ధ‌ర‌కు ధాన్యం అమ్ముకున్న రైతుల‌కు ప‌రిహారం ఇవ్వాల‌ని ఆమె డిమాండ్ చేశారు. శుక్ర‌వారం నాడు మీడియాతో మాట్లాడిన ష‌ర్మిల.. తెలంగాణ స‌ర్కారు తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల మాట్లాడుతూ, రైతులంటే కేసీఆర్‌కు విలువ, గౌరవం లేవని, రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నా స్పందించరని ఆరోపించారు. 8 ఏండ్లలో 8 వేల మంది రైతుల ఆత్మహత్యకు కేసీఆరే కార‌ణ‌మ‌న్న ష‌ర్మిల‌.. రైతులు కోటీశ్వరులై, కార్లలో తిరిగితే ఈ ఆత్మహత్యలు ఎందుకు జ‌రుగుతాయ‌ని ప్ర‌శ్నించారు. వైఎస్సార్ హ‌యాంలో వ్య‌వ‌సాయం పండుగైతే, కేసీఆర్ హయాంలో దండగైందని విమ‌ర్శించారు. రుణమాఫీ, నష్టపరిహారం, ఇన్ పుడ్ సబ్సిడీ, రాయితీ విత్తనాలు, సబ్సిడీ ఎరువులను కేసీఆర్ నిలిపేశార‌ని ఆమె ధ్వ‌జ‌మెత్తారు.

దళితులకు మూడెకరాలు ఇస్తామని మోసం చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు దళితబంధు ఇస్తానని మళ్లీ మోసం చేస్తున్నార‌ని ష‌ర్మిల ఆరోపించారు. మూడెకరాలకు రూ.30 లక్షలు అవుతుందన్న ష‌ర్మిల‌.. రూ.10 లక్షలు ఇచ్చి మమా అనిపించే ప్రయత్నం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. కేసీఆర్‌కు ఓట్లతోనే పని, ప్రజలతో పనిలేదన్న ష‌ర్మిల‌.. వడ్లు కొనబోమన్న కేసీఆర్ మాటకు 17లక్షల ఎకరాలను రైతులు పడావుపెట్టారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రైతు కూలీలకు పని లేకుండా చేశారని, వారందరికీ కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

వరి వేయని రైతులకు ఎకరాకు రూ.25వేల చొప్పున చెల్లించాలని, దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు ఇప్పుడు 40 లక్షల టన్నుల రారైస్ ఇస్తామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ సిగ్గుపడి, తలదించుకోవాలని, ‌ఆయన తీరుతో తక్కువకే అమ్ముకున్న 10 లక్షల టన్నుల వడ్లకు కూడా పరిహారం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. రైతులను మానసిక క్షోభకు గురిచేసినందుకు 20% బోనస్ ఇచ్చి వడ్లు కొనాలని కూడా ష‌ర్మిల డిమాండ్ చేశారు.


More Telugu News