ప్రధాని మోదీని అంబేద్కర్ తో పోల్చిన మ్యాస్ట్రో ఇళయరాజా

  • ఓ పుస్తకావిష్కరణ సభలో ఇసైజ్ఞాని ప్రసంగం
  • మోదీ అండ్ అంబేద్కర్ పుస్తకాన్ని తీసుకువచ్చిన బ్లూక్రాఫ్ట్ సంస్థ
  • పుస్తకానికి ముందుమాట రాసిన ఇళయరాజా
సప్తస్వరాలకు ఇంత శక్తి ఉంటుందా అనిపించేలా మనసును మైమపరిపించే బాణీలు, వినసొంపైన సంగీతంతో దశాబ్దాలుగా శ్రోతలను అలరిస్తున్న ఇసైజ్ఞాని ఇళయరాజా రాజకీయాల గురించి మాట్లాడడం చాలా అరుదైన విషయం. అయితే, ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఇళయరాజా ప్రధాని నరేంద్ర మోదీ గురించి ప్రస్తావించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దేశంలో మోదీ సాగిస్తున్న సుపరిపాలన చూస్తే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ తప్పకుండా గర్వించేవారని కొనియాడారు. 

'బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్' సంస్థ ఇటీవల 'మోదీ అండ్ అంబేద్కర్' అనే పుస్తకాన్ని తీసుకువచ్చింది. ఈ పుస్తకానికి ఇళయరాజానే ముందుమాట రాయడం విశేషం. పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ, అన్ని రంగాల్లోనూ విశేష రీతిలో అభివృద్ధి సాధించిన భారత్, మోదీ మార్గదర్శనంలో పురోగామి పథంలో పయనిస్తోందని కితాబునిచ్చారు. 

దేశంలో మౌలిక సదుపాయాలకు లోటు లేకుండా చేశారని, సామాజిక న్యాయం దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నారని ఇళయరాజా పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ వ్యతిరేక చట్టం వంటి కీలక నిర్ణయాల ద్వారా మహిళల జీవితాల్లోనూ మోదీ గుణాత్మక మార్పులు తీసుకువచ్చారని వివరించారు. మోదీ పరిపాలనను చూస్తే అంబేద్కర్ తప్పకుండా సంతోషించేవారని పేర్కొన్నారు. 

అంబేద్కర్, మోదీ ఒకే తరహా నేపథ్యం నుంచి వచ్చారని, ఇరువురు పేదరికాన్ని, అణచివేతను చవిచూసిన వారేనని ఇళయారాజా గుర్తుచేశారు. తాము ఎదుర్కొన్న రుగ్మతలను రూపుమాపేందుకు ఇరువురు కృషి చేశారని, భారతదేశ సమున్నత భవిష్యత్ కోసం ఇద్దరూ పెద్ద కలలు కన్నవారేనని వివరించారు. దేశ అభ్యున్నతి కోసం తమ ఆలోచనలను ఆచరణలో పెట్టారని తెలిపారు. మోదీ అండ్ అంబేద్కర్ అనే పుస్తకం ఇరువురి మధ్య ఉన్న పోలికలను వివరిస్తుందని ఇసైజ్ఞాని వెల్లడించారు.


More Telugu News