టీ20 ప్రపంచకప్‌కూ దూరమైన దీపక్ చాహర్!

  • గాయంతో ఐపీఎల్‌కు దూరమైన దీపక్ చాహర్
  • వెన్ను గాయానికి నాలుగు నెలల విశ్రాంతి
  • చాహర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ముగ్గురి పేర్లను పరిశీలిస్తున్న సీఎస్‌కే
గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ దీపక్ చాహర్ ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరం కానున్నాడు. స్కానింగ్ రిపోర్టులను బట్టి వెన్నుకు అయిన గాయానికి అతడు కనీసం నాలుగు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అక్టోబరు-నవంబరులో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు అతడు అందుబాటులో ఉండడం అనుమానమే. 

ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో ఉంటూ కోలుకుంటున్న చాహర్ ఇటీవల నెట్స్‌లో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. దీంతో ఐపీఎల్‌లో కనీసం సగం మ్యాచ్‌లకైనా అతడు అందుబాటులో ఉంటాడని చెన్నై భావించింది. అయితే, తాజా గాయం కారణంగా అతడు సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. 

బెంగళూరులో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో చాహర్‌ను చెన్నై రూ. 14 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో చతికిల పడిన చెన్నైకి అతడు దూరం కావడం పెద్ద ఎదురు దెబ్బే. దీంతో అతడి స్థానాన్ని వీలైనంత త్వరగా భర్తీ చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ఇషాంత్ శర్మ, సందీప్ వారియర్, ధవళ్ కులకర్ణి పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.


More Telugu News