ఏలూరు ఘటన మృతుల్లో బీహారీలు... పరిహారం ప్రకటించిన సీఎం నితీశ్ కుమార్

  • అక్కిరెడ్డిగూడెం వద్ద పోరస్ కంపెనీలో భారీ ప్రమాదం
  • ఆరుగురి మృతి.. వారిలో నలుగురు బీహార్ కార్మికులు
  • రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించిన నితీశ్
ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కర్మాగారంలో రియాక్టర్ పేలి గ్యాస్ లీకైన ఘటనలో ఆరుగురు మృత్యువాతపడడం తెలిసిందే. మరణించిన వారిలో నలుగురు బీహార్ కు చెందిన కార్మికులు ఉన్నారు. ఈ నేపథ్యంలో, బీహార్ సీఎం నితీశ్ కుమార్ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున అందిస్తున్నట్టు వెల్లడించారు. 

క్షతగాత్రులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక్కొక్కరికి రూ.50 వేలు అందించనున్నట్టు తెలిపారు. బీహార్ కార్మికుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించే క్రమంలో ఏపీ ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని ఢిల్లీలోని బీహార్ రెసిడెంట్ కమిషనర్ కు స్పష్టం చేశారు.

కాగా, పోరస్ ఘటన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రూ.25 లక్షల పరిహారం ప్రకటించగా, పోరస్ సంస్థ నుంచి రూ.25 లక్షల చొప్పున ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ వెల్లడించారు.


More Telugu News