తెలంగాణ నలుమూలలా చెక్ పోస్టులు... ఏపీ నుంచి వ‌స్తున్న ధాన్యం లారీలు తిరుగుముఖం

  • తెలంగాణ‌లో ప్రారంభ‌మైన ధాన్యం కొనుగోళ్లు
  • ఇత‌ర రాష్ట్రాల ధాన్యాన్ని అడ్డుకునేందుకు చెక్ పోస్టులు
  • ఏపీ నుంచి వ‌చ్చిన ధాన్యాన్ని అడ్డుకున్న అధికారులు
తెలంగాణ‌లో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభ‌మైపోయాయి. ధాన్యం కొనుగోళ్ల‌పై కొన్నిరోజుల పాటు టీఆర్ఎస్, బీజేపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డిచిన త‌ర్వాత చివ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే ధాన్యం కొంటుందంటూ టీఆర్ఎస్ స‌ర్కారు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభ‌మవుతున్నాయి. కొన్నిచోట్ల ధాన్యం కొనుగోళ్లు కూడా ఇప్ప‌టికే ప్రారంభ‌మ‌య్యాయి.

అయితే తెలంగాణ రైతుల‌కు న‌ష్టం జ‌ర‌గ‌కూడ‌దంటే... పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం తెలంగాణ‌కు త‌ర‌లిరాకూడ‌దంటూ తెలంగాణ స‌ర్కారు నిర్ణయించింది. ఇలా పొరుగు రాష్ట్రాల నుంచి త‌ర‌లివచ్చే ధాన్యాన్ని నియంత్రించేందుకు రాష్ట్రం న‌లుమూలలా 51 చెక్ పోస్టుల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లుగా బుధ‌వారం నాడే మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ప్ర‌క‌టించారు. 

మంత్రి ప్ర‌క‌ట‌న‌ను అనుస‌రించి బుధ‌వారం రాత్రి నుంచే ఆయా రాష్ట్రాల స‌రిహ‌ద్దుల్లో తెలంగాణ చెక్‌పోస్టులు ఏర్పాటైపోయాయి. ఇదేమీ తెలియ‌ని ఏపీకి చెందిన‌ కొంద‌రు త‌మ ధాన్యాన్ని లారీల్లో తెలంగాణ మీదుగా త‌ర‌లించే య‌త్నం చేశారు. ఈ లారీల‌ను సూర్యాపేట జిల్లా ప‌రిధిలోని రామాపూర్ క్రాస్ వ‌ద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌కు చెందిన అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆ లారీలు తిరిగి ఏపీకే వెళ్లిపోయాయి. 



More Telugu News