ఏడేళ్లలో కేసీఆర్‌ ఒక్కసారి కూడా అంబేద్క‌ర్‌కు నివాళులు అర్పించలేదు: బండి సంజ‌య్

  • అంబేద్క‌ర్‌ విగ్రహానికి కేసీఆర్‌ నివాళులు అర్పించాలన్న సంజయ్ 
  • అంబేద్క‌ర్‌ స్ఫూర్తిని బీజేపీ ముందుకు తీసుకెళుతోందని వ్యాఖ్య 
  • దళిత వ్యక్తిని రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదేనన్న సంజయ్ 
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. హైద‌రాబాద్‌ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్క‌ర్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... అంబేద్క‌ర్‌ విగ్రహానికి కేసీఆర్‌ నివాళులు అర్పించాలని డిమాండ్‌ చేశారు. 

తెలంగాణ రాష్ట్రం వ‌చ్చిన త‌ర్వాత‌ కేసీఆర్‌ ఏడేళ్లలో ఒక్కసారి కూడా అంబేద్క‌ర్‌కు నివాళులు అర్పించలేదని ఆయ‌న విమ‌ర్శించారు. అంబేద్క‌ర్‌ స్ఫూర్తిని బీజేపీ ముందుకు తీసుకెళుతోందని అన్నారు. దళిత వ్యక్తిని రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదే అని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ అంబేద్క‌ర్‌ను అడుగడుగునా అవమానించిందని ఆయ‌న ఆరోప‌ణ‌లు చేశారు. 

12 మంది ఎస్సీలను కేంద్ర మంత్రులను చేసిన గొప్పతనం బీజేపీకే దక్కుతుందని ఆయ‌న చెప్పారు. కాగా, ఈ రోజు ఉద‌యం ఖైరతాబాద్ చౌరస్తాలోని మహావీర్ మఠ్ హనుమాన్ ఆలయాన్ని బండి సంజయ్ ప‌లువురు నేత‌ల‌తో క‌లిసి దర్శించుకున్నారు. ఆయ‌న చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో భాగంగా రెండో విడ‌త నేడు అలంపూర్‌ నుంచి ప్రారంభం కానుంది.


More Telugu News