కుప్పం వైసీపీ నేత మృతి.. హత్య చేశారన్న తమ్ముడు!

  • రైలు పట్టాలపై పడి చనిపోయిన పార్థసారథి
  • రెస్కో ఛైర్మన్ సెంథిల్ కుమార్ హస్తం ఉందన్న కార్తీక్
  • సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్
కుప్పం వైసీపీ నేత, శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ మాజీ ఛైర్మన్ పార్థసారథి మృతి సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ మృతిపై ఆయన తమ్ముడు కార్తీక్ అనుమానాలను వ్యక్తం చేశారు. తన అన్నను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని... ఈ మృతిపై సీఐడీ లేదా సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కోరుతూ పలమనేరు డీఎస్పీ గంగయ్యకు ఫిర్యాదు చేశారు. కేసును రైల్వే పోలీసుల నుంచి స్థానిక పోలీసులకు బదిలీ చేయాలని కోరారు.

ఈ సందర్భంగా కార్తీక్ మీడియాతో మాట్లాడుతూ, తన అన్న రైలు కింద పడి చనిపోయాడని సమాచారం వచ్చిన వెంటనే ఘటనా స్థలికి వెళ్లామని... అప్పటికే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని ఫిర్యాదులో కార్తీక్ తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం మృతదేహాన్ని అందించగా... మరుసటి రోజు దహనం చేశామని చెప్పారు. 

అన్న చనిపోయిన రోజే మరణవాంగ్మూలం వీడియో బయటకు వచ్చిందని... తన చావుకు ముగ్గురు కారణమని చెప్పారని... ముగ్గురితో పాటు మరికొందరు ఉన్నారని కార్తీక్ అన్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో 22వ సెగ్మెంట్ లో రెస్కో ఛైర్మన్ సెంథిల్ కుమార్ తమ్ముడు అరుల్ కుమార్ ను నిలబెట్టారని... ఈ ఎన్నికల్లో అరుల్ కుమార్ ఓడిపోయాడని చెప్పారు. 

అయితే పార్థసారథి ఇన్ఛార్జీగా ఉండి కూడి గెలిపించలేకపోయారంటూ ఆయనపై దూషణకు పాల్పడ్డారని...  అక్రమ కేసులు పెట్టించి, మానసికంగా కుంగిపోయేలా చేశారని అన్నారు. అన్న మరణంలో సెంథిల్ కుమార్, అరుల్ కుమార్, ఇతర అనుచరుల పాత్ర ఉందని తాము బలంగా నమ్ముతున్నామని చెప్పారు.


More Telugu News