అక్బరుద్దీన్ ఓవైసీకి ఊర‌ట‌.. విద్వేష‌పూరిత వ్యాఖ్య‌ల కేసు కొట్టివేత‌

  • ఆదిలాబాద్‌, నిజామాబాద్ జిల్లాల్లో విద్వేష పూరిత ప్రసంగాలు చేశారంటూ కేసులు  
  • అక్బ‌రుద్దీన్‌ను నిర్దోషిగా ప్ర‌క‌టించిన కోర్టు
  • భ‌విష్య‌త్తులో విద్వేష ప్ర‌సంగాలు చేయ‌రాద‌ని జడ్జి సూచ‌న‌
  • తీర్పును విజ‌యంగా భావించ‌వ‌ద్ద‌న్న కోర్టు
  • సంబ‌రాలకు అనుమ‌తి లేదంటూ స్పష్టీకరణ 
మ‌జ్లిస్ కీల‌క నేత‌, తెలంగాణ అసెంబ్లీలో ఆ పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీకి భారీ ఊర‌ట ద‌క్కింది. విద్వేష‌పూరిత వ్యాఖ్య‌లు చేశారంటూ ఆయ‌న‌పై న‌మోదైన కేసుల‌ను కొట్టివేస్తూ నాంప‌ల్లి కోర్టు బుధ‌వారం నాడు కీల‌క తీర్పు చెప్పింది. ఈ కేసులో అక్బ‌రుద్దీన్‌ను నిర్దోషిగా ప్ర‌క‌టించిన కోర్టు.. ఈ కేసును కొట్టివేస్తున్న‌ట్టు ప్ర‌కటించింది. 

తెలుగు నేల ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న స‌మ‌యంలో 2012 డిసెంబ‌ర్ నెలాఖ‌రులో ఆదిలాబాద్‌, నిజామాబాద్ జిల్లాల్లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా మ‌త విద్వేషాలు రెచ్చ‌గొట్టేలా అక్బ‌రుద్దీన్ ప్ర‌సంగించారంటూ ఆయ‌న‌పై కేసులు న‌మోద‌య్యాయి. ఈ కేసుల్లో 2013లో అరెస్టైన అక్బరుద్దీన్.. ఆ త‌ర్వాత బెయిల్ తీసుకుని బ‌య‌ట‌కు వ‌చ్చారు. నాటి నుంచి ఈ కేసును నాంప‌ల్లి కోర్టు విచారిస్తున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఇటీవ‌లే ఈ కేసు విచార‌ణ‌ను ముగించిన కోర్టు ఈ నెల 12న తుది తీర్పు వెలువ‌రించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే మంగ‌ళ‌వారం నాడు తీర్పును మ‌రోమారు వాయిదా వేసిన కోర్టు.. బుధ‌వారం నాడు త‌న తుది తీర్పును వెలువ‌రించింది. ఈ తీర్పులో అక్బరుద్దీన్ ని నిర్దోషిగా పేర్కొన్న కోర్టు.. కేసును కొట్టేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించింది. 

ఈ సంద‌ర్భంగా కోర్టుకు హాజ‌రైన అక్బరుద్దీన్ కి న్యాయ‌మూర్తి ప‌లు సూచ‌న‌లు చేశారు. భ‌విష్య‌త్తులో ఎలాంటి విద్వేష‌పూరిత వ్యాఖ్య‌లు చేయ‌రాద‌ని చెప్పిన కోర్టు... అలాంటి ప్ర‌సంగాలు దేశ స‌మ‌గ్ర‌త‌కు మంచిది కాద‌ని తేల్చి చెప్పారు. అంతేకాకుండా ఈ తీర్పును త‌న విజ‌యంగా ప‌రిగ‌ణించ‌రాద‌ని కూడా కోర్టు ఆయనకు సూచించింది. ఎలాంటి సంబ‌రాల‌కు అనుమతి లేద‌ని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది. 


More Telugu News