కరోనా వ్యాక్సిన్ తో గుండెకు ఎంతవరకు చేటు?

  • సింగపూర్ పరిశోధకుల అధ్యయనం
  • మిగతా వ్యాక్సిన్లతో పోలిస్తే తక్కువేనని వెల్లడి
  • పది లక్షల డోసుల్లో 18 సందర్భాల్లో మయోపెరికార్డైటిస్
  • ఎంఆర్ఎన్ఏ టీకాలతోనే ఎక్కువ ముప్పు
కరోనా వ్యాక్సిన్ పై చాలా మందికి ఇప్పటికీ చాలా అపోహలున్నాయి. మరి, కరోనా వ్యాక్సిన్ తో గుండెకు కూడా చేటేనా? అధ్యయనాలేం చెబుతున్నాయి? అంటే.. మిగతా నాన్ కొవిడ్ టీకాలతో పోలిస్తే కరోనా టీకాలతో గుండెకు కలిగే చేటు చాలా తక్కువేనని సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్ చేసిన అధ్యయనంలో తేలింది. కొల్లెంగోడే రామనాథన్ అనే భారత సంతతి శాస్త్రవేత్త నేతృత్వంలో ఈ పరిశోధన జరిగింది. 

అధ్యయనంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ సందర్భాలను శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. దాంతో పాటు 1947 నుంచి 2021 డిసెంబర్ వరకు జరిగిన అన్ని రకాల టీకాలపై సాగిన అధ్యయనాలనూ పరిశోధించింది. 

10 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసుల్లో కేవలం 18 సందర్భాల్లోనే ‘మయోపెరికార్డైటిస్’ అనే గుండెవ్యాధి వస్తున్నట్టు సైంటిస్టులు తేల్చారు. ఫ్లూ, మశూచిల వల్ల కలిగే దుష్పరిణామాల కన్నా కొవిడ్ టీకాలతో గుండెకు కలిగే ముప్పు చాలా తక్కువని అన్నారు. 

ఇతర వ్యాక్సిన్లలో మయోపెరికార్డైటిస్ ముప్పు పది లక్షల డోసుల్లో 56గా ఉందని తేల్చారు. వాస్తవానికి మయోపెరికార్డైటిస్ వస్తే గుండె తీవ్రంగా దెబ్బతింటుందని చెబుతున్నారు. మామూలుగా వైరస్ లతో ఇది వస్తుంటుంది. అప్పుడప్పుడు వ్యాక్సినేషన్ వల్ల కూడా ఈ దుష్ప్రభావం వస్తుంటుందని అంటున్నారు. 

ఎంఆర్ఎన్ఏ ఆధారంగా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ వల్ల మయోపెరికార్డైటిస్ ముప్పు వచ్చినట్టు పలు రిపోర్టులున్నాయి. పది లక్షల ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ డోసుల్లో 22.6 సందర్భాల్లో మయోపెరికార్డైటిస్ వచ్చినట్టు పరిశోధనలు గుర్తించాయి. అదే మామూలు టీకాల్లో అయితే కేవలం 7.9 అని తేల్చాయి. అయితే, తమ పరిశోధనల్లో పిల్లల వ్యాక్సినేషన్ ను పరిగణనలోకి తీసుకోలేదని, పెద్దలకు ఇచ్చిన టీకాలపైనే పరిశోధన చేశామని శాస్త్రవేత్తలు తెలిపారు.


More Telugu News