ఈ గెలుపును నా భార్య, జట్టు సభ్యులకు అంకితమిస్తున్నాను: రవీంద్ర జడేజా

  • సార‌థిగా తొలి విజ‌యాన్ని చ‌విచూశాను
  • తొలి విజయం ఎప్పుడూ ప్రత్యేకమే
  • అన్ని విభాగాల్లోనూ రాణించాం
  • రాబిన్‌, శివమ్ అద్భుతంగా ఆడార‌న్న జ‌డేజా
గత రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జ‌ట్టు విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ సీజ‌న్‌లో ఆ జట్టుకు, సారథిగా రవీంద్ర జడేజాకి ఇదే తొలి విజయం. ఈ సంద‌ర్భంగా జడేజా మాట్లాడుతూ.. సార‌థిగా తొలి విజ‌యాన్ని చ‌విచూశాన‌ని చెప్పాడు. ఈ గెలుపును నా భార్య, జట్టు సభ్యులకు అంకితమిస్తున్న‌ట్లు పేర్కొన్నాడు. తొలి విజయం ఎప్పుడూ ప్రత్యేకమేన‌ని తెలిపాడు. 

నిన్న‌టి మ్యాచ్‌లో తాము అన్ని విభాగాల్లోనూ రాణించామ‌ని అన్నాడు. రాబిన్‌ ఊతప్ప, శివమ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారని, త‌మ జ‌ట్టులోని బౌలర్లు కూడా బాగా కష్టపడ్డారని ప్రశంసించాడు. ఈ సీజ‌న్‌లో తాము ఆడిన‌ తొలి నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయిన‌ప్ప‌టికీ త‌మ‌ యాజమాన్యం ఎలాంటి ఒత్తిడికి గురి చేయలేదని, ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంద‌ని తెలిపాడు. 

సారథిగా తాను కూడా సీనియర్ల సలహాలు తీసుకుంటాన‌ని, ధోనీతో చర్చిస్తాన‌ని వివ‌రించాడు. సార‌థిగా తాను ఇప్పటికీ నేర్చుకునే దశలోనే ఉన్నాన‌ని తెలిపాడు. తాము ఆట‌ను పాజిటివ్ దృక్ప‌థంతో ఆడేందుకు ప్రయత్నిస్తూనే ఉంటామ‌ని అన్నాడు. తదుపరి మ్యాచుల్లోనూ బాగా రాణిస్తామ‌ని అన్నాడు. శివం దూబె మాట్లాడుతూ.. తాము తొలి విజయం సాధించామ‌ని, ఇందులో తాను కీలక పాత్ర పోషించడం చాలా ఆనందంగా ఉంద‌ని అన్నాడు. తాను సీనియర్లతో మాట్లాడుతూనే ఉంటానని చెప్పాడు. 

కాగా, ఈ సంద‌ర్భంగా  బెంగళూరు కెప్టెన్‌ డుప్లెసిస్ మాట్లాడుతూ.. మ్యాచులో భారీ స్కోరు ఛేదించాలంటే ఆరంభంలో బాగా ఆడాల‌ని, తాము స్వల్ప వ్యవధిలోనే వికెట్లను కోల్పోయామ‌ని అన్నాడు. అయితే, లోయర్‌ ఆర్డర్‌ వరకూ త‌మ బ్యాటింగ్‌ పవర్‌ ఏంటో చూపించగలిగామ‌ని చెప్పాడు. తాము చెన్నై జ‌ట్టును మొద‌ట ఒత్తిడికి గురి చేసిన‌ప్ప‌టికీ ఆ జ‌ట్టులోని శివమ్‌ దూబే, ఊతప్ప చాలా బాగా ఆడార‌ని చెప్పాడు. 


More Telugu News