ప్ర‌భుత్వం చివ‌రి గింజ కొనేవ‌ర‌కు మా పోరాటం ఆగ‌దు: కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

  • ఇప్ప‌టికే వ‌రి అమ్మి న‌ష్ట‌పోయిన రైతుల‌కు ప‌రిహారం ఇవ్వాలన్న కోమటిరెడ్డి 
  • ఇత‌ర పంట‌లు వేసి న‌ష్ట‌పోయి‌న వారికి ప‌రిహారం ఇవ్వాలని డిమాండ్ 
  • 111 జీవోపై అఖిల‌ప‌క్ష భేటీ పెట్టాల‌ని గ‌వ‌ర్న‌ర్‌ను కోర‌తామని వ్యాఖ్య 
తెలంగాణ ప్ర‌భుత్వంపై కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి మండిప‌డ్డారు. ఈ రోజు హైద‌రాబాద్‌లోని సీఎల్పీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రైతుల ప్ర‌యోజ‌నాల కోసం త‌మ‌ పోరాటాన్ని కొన‌సాగిస్తామ‌ని అన్నారు. ప్ర‌భుత్వం ధాన్యానికి సంబంధించి చివ‌రి గింజ కొనేవ‌ర‌కు త‌మ‌ పోరాటం ఆగ‌దని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే త‌క్కువ ధ‌ర‌ల‌కు వ‌రి అమ్మి న‌ష్ట‌పోయిన రైతుల‌కు ప‌రిహారం ఇవ్వాలని ఆయ‌న డిమాండ్ చేశారు. 

ప్ర‌భుత్వం చెప్పిన‌ట్లు ఇత‌ర పంట‌లు వేసి న‌ష్ట‌పోయిన వారికి కూడా ప‌రిహారం ఇవ్వాలని ఆయన అన్నారు. 111 జీవోపై అఖిల‌ప‌క్ష భేటీ పెట్టాల‌ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌రరాజ‌న్‌ను కోర‌తామ‌ని ఆయ‌న చెప్పారు. 111 జీవో ప‌రిధిలో ఆక్ర‌మ‌ణ‌ల‌పై సీబీఐ విచార‌ణ కోర‌తామ‌ని చెప్పారు. అలాగే, మూసీ ప్ర‌క్షాళ‌న‌పై గ‌వ‌ర్న‌ర్‌కు వివ‌రిస్తామ‌ని తెలిపారు.


More Telugu News