అక్బరుద్దీన్ పై తీర్పును అనూహ్యంగా వాయిదా వేసిన నాంపల్లి కోర్టు

  • తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటన
  • పాతబస్తీ, నిర్మల్ లో బందోబస్తును పెంచిన పోలీసులు
  • తొమ్మిదేళ్ల క్రితం హిందువులు, హిందూ దేవతలపై విద్వేష వ్యాఖ్యలు
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ విద్వేషపూరిత వ్యాఖ్యలపై తీర్పును కోర్టు వాయిదా వేసింది. వాస్తవానికి ఇవాళే తీర్పును వెలువరించాల్సి ఉన్నా.. తీర్పును రేపటికి వాయిదా వేస్తూ నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకుంది. తొమ్మిదేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, నిజామాబాద్ పర్యటనల్లో అక్బరుద్దీన్.. హిందూ దేవతలు, హిందువులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

నిర్మల్ లోని మున్సిపల్ మైదానంలో నిర్వహించిన ఓ సభలో.. 15 నిమిషాలు టైం ఇస్తే ఎవరు ఎక్కువో.. ఎవరు తక్కువో చూపిస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘మీరు వంద కోట్ల మందైతే.. మేం కేవలం 25 కోట్ల మందిమే’ అని అన్నారు. నిజామాబాద్ లో కార్యక్రమం సందర్భంగా హిందూదేవతలను కించపరుస్తూ మాట్లాడారు. 

ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయనపై సుమోటోగా కేసు పెట్టారు. ఆ కేసుల్లో ఆయన 40 రోజుల పాటు జైలులోనూ ఉన్నారు. ఈ కేసు సుదీర్ఘ విచారణ సందర్భంగా నాంపల్లి కోర్టు 30 మంది సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఆడియోలోని గొంతు అక్బరుద్దీన్ దేనన్న ఎఫ్ఎస్ఎల్ రిపోర్టును సీఐడీ అధికారులు చార్జిషీట్ లో పేర్కొన్నారు. 

ఇవాళ తీర్పు వెలువడాల్సి వున్నా అనూహ్యంగా కోర్టు వాయిదా వేసింది. ఎలాంటి ఘటనలు జరగకుండా కోర్టు దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. హైదరాబాద్ లోని పాతబస్తీ, నిర్మల్ లోనూ పోలీసులు బందోబస్తును పెంచారు. దేశంలోని రాజకీయ నేతలపై నమోదైన దేశ ద్రోహం కేసుల్లో తీర్పు రానున్న మొదటి కేసు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.


More Telugu News