హిందుత్వ నేతలుగా గుర్తింపు తెచ్చుకోవాలనే ఒవైసీపై అటాక్ చేసాం..  చార్జ్ షీట్ లో నిందితుల వెల్లడి

  • చార్జ్ షీటు దాఖలు
  • పథకం ప్రకారమే దాడి
  • ఎవరైనా గాయపడి ఉంటే శాంతి భద్రతలు అదుపు తప్పేవి
  • కోర్టుకు వెల్లడించిన పోలీసులు
ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా (ఫిబ్రవరి 3న) ఎంఐఎం అధినేత, లోక్ సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై దుండగులు కాల్పులకు పాల్పడిన కేసులో పోలీసులు చార్జ్ షీటు దాఖలు చేశారు. దాడి తర్వాత సచిన్, సుభమ్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నాడు ప్రచారం అనంతరం ఒవైసీ తిరిగి ఢిల్లీకి వెళుతున్న సమయంలో ఇది జరిగింది.

ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జ్ షీట్ ను పరిశీలించగా.. మరో మత వర్గానికి చెందిన ముఖ్య రాజకీయ నేతను అంతమొందించడం ద్వారా ప్రముఖ హిందుత్వ నేతలుగా గుర్తింపు తెచ్చుకోవచ్చన్న ఆలోచనతోనే తాము దాడికి పాల్పడినట్టు నిందితులు వెల్లడించారు. 

‘‘పూర్తిస్థాయి సన్నద్ధతతో గౌరవ ఎంపీని హత్య చేసేందుకు నిందితులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడి ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దిగజారిపోయి ఉండేది. సంఘ విద్రోహ శక్తులు దీన్ని అవకాశంగా తీసుకునేవి’’ అని పోలీసులు పేర్కొన్నారు. సాక్ష్యాధారంగా చార్జ్ షీట్ తోపాటు సీసీటీవీ ఫుటేజీని కోర్టుకు సమర్పించారు. ఒవైసీతోపాటు 61 మంది స్టేట్ మెంట్ ను చార్జ్ షీటులో పేర్కొన్నారు. సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసుగా పోలీసులు నమోదు చేయడం గమనార్హం.


More Telugu News